శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (18:20 IST)

పెళ్లి రోజునే జూనియర్ ప్రణయ్ పుట్టాడు.. నెట్టింట ఫోటో వైరల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరువు కోసం తన అల్లుడిని సుఫారీ ఇచ్చీ మరీ చంపించాడు.. అమృత తండ్రి. అప్పటికే అమృత ఆరు నెలల గర్భిణి.


ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం (జనవరి 30) సాయంత్రం అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో ప్రణయ్, అమృత వర్షిణి ప్రేమ వివాహం చేసుకొని బుధవారానికి సరిగ్గా ఏడాది అవుతోంది. అదే రోజున పండంటి బిడ్డ జన్మించడంతో ప్రణయ్ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు. పెళ్లి రోజున మళ్లీ ప్రణయ్ తమకు బిడ్డగా పుట్టాడని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన పెళ్లి రోజును పురస్కరించుకుని సోషల్ మీడియా ద్వారా తన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అమృత. 
 
మనకు పెళ్లై ఏడాది అయ్యింది. గత ఏడాది ఇదే రోజున నీ కోసం నేను.. నీ చెయ్యి పట్టుకుని నడిచేందుకు ఆతృతగా ఎదురుచూసిన సమయం అది.. ఇప్పుడు నీ బేబిని నా చేతుల్లో పెట్టుకుని మోయడానికి ఎదురుచూస్తున్నాను. ఇది త్వరలోనే నెరవేరబోతుంది. లవ్ యూ లల్లూ.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ కామెంట్ చేసింది. 
 
తన పెళ్లి రోజునాటి జ్ణాపకాలను నెటిజన్లతో పంచుకున్న అమృతకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రణయ్ ను మిస్ కావటం బాధకలిగించింది అంటూ ఓదార్పులు కూడా చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రణయ్, అమృత దంపతుల ముద్దుల బిడ్డ ఫోటోను కూడా విడుదల చేశారు. నాలుగు నెలల క్రితం హత్యకు గురైన ప్రణయ్.. ఇంట చిన్నారి ప్రణయ్ పుట్టడంతో చిరునవ్వులు వికసిస్తున్నాయి. 
 
తాజాగా ప్రణయ్ జూనియర్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. గత ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ ప్రణయ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అమృత వర్షిణి తండ్రి మారుతీ రావు.. ప్రణయ్‌ని పరువు కోసం హత్య చేయించిన సంగతి తెలిసిందే.