గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 20 జూన్ 2017 (19:38 IST)

ప్రజల ఆరోగ్యం కోసమే ‘ఎన్.టి.ఆర్. సుజల పధకం’... సీఎం చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఎన్.టి.ఆర్. సుజల పధకం’ను ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామంలో ఎన్.టి.ఆర్

రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఎన్.టి.ఆర్. సుజల పధకం’ను ప్రవేశపెట్టిందని  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామంలో ఎన్.టి.ఆర్. ట్రస్ట్ ఏర్పాటుచేసిన ‘ఎన్.టి.ఆర్. సుజల పధకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే హరిశ్చంద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను కూడా రిమోట్ ద్వారా ఆయన ప్రారంభించారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలకు క్యాన్ రూ.2లు వంతున 20 లీటర్ల క్యాన్‌ను అందిస్తారు. సుమారు 2 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. 
 
తినే తిండి, సరియైన తాగునీరు తీసుకోకపోవడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వలన ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, వారికి మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే ఆశయంతో ప్రభుత్వం శుద్ధమైన తాగునీటిని అందించే సుజల పధకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పధకం ద్వారా కేవలం రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీటి క్యాన్‌ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలుష్య సమస్య అనేది లేకుండా ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శుద్ధమైన తాగునీరు మాత్రమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవలసిన బాధ్యత గ్రామస్తులకు ఉండాలన్నారు. మంచి ఆహారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. 
 
తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరుతో ట్రస్ట్‌ను స్థాపించి, నిరంతరం పేద ప్రజలకు సేవలు అందిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు కొనియాడారు. బసవరామ తారకం పేరుతో క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా పేదవారికి క్యాన్సర్‌కు అవసరమైన చికిత్సను అందించడం హర్షణీయమని అన్నారు. రాబోయే రోజుల్లో ఏ గ్రామాల్లో ఏయే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారో తెలుసుకునేందుకు ‘హెల్త్ రికార్డు’ను తయారుచేయనున్నట్లు తెలిపారు. ఆ రికార్డు ఆధారంగా ప్రజలకు సత్వరమే మెరుగైన వైద్య చికిత్స అందించే అవకాశం కలుగుతుందన్నారు. 
 
రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు మురుగు కాల్వ వ్యవస్థను మెరుగుపరచడం, చెత్త చెదారాన్ని గ్రామ సుదూర ప్రాంతాలలో చేరవేయడం వంటి కార్యక్రమాలను విరివిగా చేపట్టాలని గ్రామస్తులకు సూచించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన అధికారులను ట్రస్ట్ నిర్వాహకులు ముఖ్యమంత్రి చేతులమీదుగా సత్కరించారు.
 
ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు, పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, జి.వి.ఎస్. ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, సి.ఆర్.డి.ఏ. కమీషనర్ శ్రీధర్ చెరుకూరి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, 29 గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.