మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (20:57 IST)

విజయవాడలో సి. రాఘవాచారి పేరుతో పార్కు

విజయవాడ నగర అభివృద్ధిలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న 40 పార్కులలో ఒక దానికి ప్రముఖ సంపాదకులు, కీర్తిశేషులు చక్రవర్తుల రాఘవాచారి పేరు పెట్టడానికి  విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సుముఖత వ్యక్తం చేశారు.

గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ మీడియా డైరీ- 2020 ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీడియా సహకరించాలని కోరారు.

నగరంలో పారిశుద్ధ్య మెరుగుదలకు కార్పొరేషన్ చేపట్టిన కార్యక్రమాలను సవివరంగా వివరించారు. కృష్ణా అర్బన్ యూనిట్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన మీడియా డైరీ ఆవిష్కరణ సభలో ఐ జే యు జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ డైరీని సకాలంలో తీసుకు రావడానికి సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సభలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ.సుబ్బారావు, చందు జనార్థన్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మ రాజు చలపతిరావు, ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు ఎస్ కె  బాబు మాట్లాడుతూ డైరీ ప్రాధాన్యతను వివరించారు.

అర్బన్ యూనిట్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు అతిథులకు స్వాగతం పలుకగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి వసంత్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు హాజరయ్యారు.