రాష్ట్ర ఆర్థికాభివృద్ధి తీవ్రంగా తగ్గిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిని అంచనా వేసేందుకు పరిగణనలోకి తీసుకునే పలు అంశాల ఆధారంగా జాతీయస్థాయిలో ఒక ప్రైవేటు సంస్థ రూపొందించిన నివేదిక ఈ విషయం వెల్లడించింది.
పలు అంశాల్లో ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితి ఎలా ఉందో లెక్కలు తీసి, అంతకు ముందున్న ఏడాదితో పోల్చింది. ప్రతి రాష్ట్రానికీ ఆయా సూచికల్లో వచ్చిన మార్కులను కలిపి మొత్తం స్కోరును ఇచ్చింది.
మూలధన వ్యయం-ఆదాయంలో కోత
ఆర్థికాభివృద్ధి ఎలా ఉందో చెప్పడంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అదే సమయంలో ప్రజలు చేసే మూలధన వ్యయం అనేవి కీలకాంశాలు. ప్రభుత్వానికి పన్ను వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోలిస్తే తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల ఫీజులు, జీఎస్‌టీ, ఎక్సైజ్ తదితర పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఏడుశాతం తగ్గిందని పేర్కొంది.
ఈ ధోరణి నెలకొన్న రాష్ర్టాల్లో ఏపీనే ప్రథమస్థానంలో ఉందని పేర్కొంది. అదే సమయంలో ప్రజల మూలధన వ్యయం గణనీయంగా తగ్గిపోయింది. మూలధన వ్యయం అంటే... భూములు, స్థలాలు, ఇళ్లు, ఇతర స్థిరాస్థులపై వెచ్చించే మొత్తం. ఈ వ్యయం ఎంత ఎక్కువుంటే అంతగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క. ఈ వ్యయంపైనే ఆర్థికచక్రం ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఫ్లాట్ కొనుగోలు చేశాడని అనుకుంటే... అంతమేరకు సిమెంటు, ఇనుము, ఇసుక, కంకర అన్ని వ్యాపారాలు చేసేవారికి బాసటగా నిలిచినట్లే. అదే సమయంలో కూలీలు, పనివారికి కూడా ఉపాధి కల్పించేందుకు పరోక్షంగా కారణమైనట్లే. ఇలా మూలధన వ్యయం అన్నది ఆర్థికాభివృద్దిలో అత్యంత కీలకమైన సూచీగా పరిగణిస్తారు.
ఇలాంటి మూలధన వ్యయం గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 69శాతం పడిపోయింది. మరోవైపు ఎయిర్ ట్రాఫిక్... అంటే విమానాల్లో ప్రయాణాలు, విమనాల సంఖ్య పెరగడం విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ వెనుకంజలో ఉంది.
ఇంకోవైపు పీక్ సమయంలో విద్యుత్ డిమాండు అన్నది ఆర్థికాభివృద్ధిలో భాగంగా చూస్తారు. ఏపీలో ఏకంగా పీక్ టైమ్ విద్యుత్ డిమాండ్ 16శాతం తగ్గింది. క్రెడిట్ గ్రోత్‌లో మాత్రం రాష్ట్రానికి అధిక మార్కులే దక్కాయి.
ఇదీ ఏపీ పరిస్థితి!
మొత్తంగా ఆయా రాష్ట్రాలకు ఇచ్చిన స్కోర్లలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్ 54 పాయింట్లు, పశ్చిమబెంగాల్ 53, తమిళనాడు 49, రాజస్థాన్ 47, కేరళ 44, గుజరాత్ 42, కర్ణాటక 41, మహారాష్ట్ర 33, తెలంగాణ 31, ఆంధ్రప్రదేశ్ 24 పాయింట్లతో ఉన్నాయి.
2018, 2019లలో ఉన్న ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఆయా సంవత్సరాల మధ్య వచ్చిన వ్యత్యాసాన్ని ఈ నివేదికలో పొందుపరిచారు. కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. ఏపీలో స్థిరాస్తి కొనుగోళ్లకు చేసే మూలధన వ్యయం 69 శాతం పతనమైంది.
మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో 11శాతం, పశ్చిమబెంగాల్‌లో 29శాతం, తమిళనాడులో 37శాతం, కేరళలో 39శాతం, కర్ణాటకలో 25శాతం, మహారాష్ట్రలో 39శాతం పెరిగింది. కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే శక్తి ఏపీలో 31 శాతం క్షీణించింది. ఏపీలో విమాన ప్రయాణాలు, విమానాల సంఖ్యలో 7 శాతం పెరుగుదల నమోదైంది. కానీ చాలా రాష్టాల్లో ఇది 10శాతానికిపైగా వృద్ధిలో ఉంది.
ఏపీలో పీక్ సమయంలో విద్యుత్ డిమాండ్ 16 శాతం తగ్గిపోయింది. ఒకటి రెండు రాష్ర్టాలు మినహా దేశంలోని అన్ని రాష్ర్టాల్లో తగ్గుదల ధోరణే (మైనస్ ట్రెండు) నెలకొన్నా ఏపీలోనే దారుణ పరిస్థితి ఉంది. ఏపీలో స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ ఫీజులు, జీఎస్‌టీ, ఎక్సైజ్ పన్నుల్లో 7శాతం తగ్గుదల నమోదైంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో 5 శాతం పెరిగాయి. తమిళనాడు, రాజస్థాన్‌లోనూ స్వల్పంగా పెరిగాయి.