క్రియాశీల కార్యకర్తలతో పవన్ సమావేశాలు
నియోజకవర్గాల వారీగా క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆదేశించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు.
రానున్న నెలరోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళిక రూపొందించాలని పవన్ సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కష్టపడేవారి జాబితాలు తయారు చేయాలని.. ఈనెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలన్నారు.
భాజపాతో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై కార్యకర్తల సమావేశాల్లో చర్చించనున్నారు. గత కొన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను గుర్తించి వారికి జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు, పార్టీ ఆలోచనా విధానం, వర్తమాన రాజకీయాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన యువ అభ్యర్థుల సమావేశాలను కూడా ఏర్పాటు చేయాలని పవన్ ఆదేశించారు. పార్టీలో ఉంటూ సామాజిక సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నవారితో సేవాదళ్‌ను రూపొందించాలని ఆయన సూచించారు.