శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (20:29 IST)

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు.

ఆ వివరాలు యధాతధంగా..."యోగా అనేది మన దేశంలో ఉద్భవించిన 5వేల సంవత్సరాల పురాతన సాంప్రదాయం, ఇది శరీరం, మనస్సుల నడుమ సమన్వయం సాధించడానికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళితం చేస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం -2020 యొక్క ఇతివృత్తం ‘ఘర్‌ ఘర్ మీ యోగ్’. ఇది సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లో ఉండడం, కుటుంబ సభ్యులతో కలిసి యోగా సాధన చేయడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ఇంట్లో ఉండడం ద్వారా మనతో పాటు మన కుటుంబ సభ్యులను  కరోనా వైరస్ నుండి దూరంగా ఉంచుకోగల‌ము. యోగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచడానికి సహాయపడుతుంది.

“మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్ (సివైపి)ను అనుసరించి జూన్ 21 ఉదయం 7 గంటల నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.