నేడు ఇప్పటం గ్రామానికి జనసేనాని... ఎందుకో తెలుసా?
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ శనివారం ఇప్పటం గ్రామానికి చేరుకోనున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ గ్రామానికి ఆయన రావడానికి బలమైన కారణం ఉంది. ఈ గ్రామవాసులంతా కలిసి జనసేన పార్టీ సభకు స్థలం ఇచ్చారు. దీనికి ప్రతిఫలంగా ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల నిధులను ఇచ్చారు.
అయితే, ఈ మొత్తాన్ని గ్రామ ఖాతాలో జమ చేయాలని వైకాపా నేతలు పట్టుబట్టగా, గ్రామస్థులంతా నిరాకరించారు. దీంతో ఈ గ్రామంలో పలు గృహాలను కూల్చివేస్తున్నారు. జనసేన పార్టీ సభనకు స్థలం ఇచ్చారన్న కక్షతో రోడ్డు విస్తరణ పేరుతో ఈ చర్యకు పాల్పడుతున్నారని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ గ్రామ వాసులకు అండగా నిలబడేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో శనివారం పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం రాత్రికే మంగళగిరికి వచ్చి శనివారం ఉదయం ఆ గ్రామానికి వెళతారు.
మరోవైపు, ఇళ్ళకూల్చివేత వ్యవహారంపై పపన్ కళ్యాణ్ స్పందించారు. తమకు ఓటు వేయని వారిని శత్రువుల్లా చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న అరాచకే అందుకు నిదర్శనంటూ ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉండగా, దాన్ని 120 అడుగులు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఉదయం నుంచి జేసీబీల సాయంతో నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని తెలిపారు. కూల్చివేతలపై గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆగమేఘాలపై కూల్చివేతలు చేపట్టారని ఆయన ఆరోపించారు.