గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (17:40 IST)

లగడపాటి గారూ.. తక్కువగా అంచనా వేయకండి.. పవన్ కల్యాణ్

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్య అధికార, విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగిన పవన్.. గెలుపే లక్ష్యంగా జనంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎంపీ లగడపాటి సర్

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్య అధికార, విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగిన పవన్.. గెలుపే లక్ష్యంగా జనంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎంపీ లగడపాటి సర్వేలో పవన్ కల్యాణ్ పార్టీకి ఓట్లు రాలవని తేలింది. ఈ సర్వేపై పవన్ స్పందించారు. లగడపాటి లాంటి వారు తమ సర్వేల్లో జనసేన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. 
 
జనసేన ప్రభావం కేవలం నాలుగైదు శాతం మాత్రమే ఉంటుందని అంటున్నారని... కానీ తమ బలం 18 శాతమని, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. జనసేన కోసం తన ప్రాణాలనే పెట్టుబడిగా పెట్టానని పవన్ అన్నారు. తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశతో తాను రాజకీయాల్లోకి రాలేదని వైకాపా చీఫ్ జగన్‌ను ఉద్దేశించి పవన్ ధ్వజమెత్తారు. 
 
ఇదిలా ఉంటే.. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి తనపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. తాను చేతులు కట్టుకుని కూర్చోనని తన సంగతి తెలుసు కదా మక్కెలు ఇరగదీస్తానని హెచ్చరించారు.  తన మీద దెబ్బ పడేకొద్దీ తాను ఎదుగుతానే తప్ప తగ్గనని స్పష్టం చేశారు. 
 
తాను సీఎం అయితే రూ.110 కోట్లతో కొల్లేరులో రెండు రెగ్యులేటర్లు ఏర్పాటు చేస్తానని పవన్‌ హామీ ఇచ్చారు. కొల్లేరు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపించకపోయినా పర్వాలేదు గానీ, తన వెనక ఉండండి చాలు పోరాడి సాధించుకుందామని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు.