గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (10:33 IST)

విజయవాడ ఘటన.. ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగిన పవన్

pawan kalyan
ఏపీ సర్కారుపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేసిందని పవన్ అన్నారు. ఆస్పత్రిలో పని చేస్తున్నవారే కావడం చూస్తుంటే అక్కడి నిఘా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుందని ఫైర్ అయ్యారు. 
 
తమ బిడ్డ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తే అధికారుల నుంచి స్పందన లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే స్పందించి వుంటే ఆమెపై ఘోర అకృత్యం జరిగేదా అని ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు పవన్. విజయవాడ బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో ప్రజలకు వివరణ ఇవ్వాలని పవన్ కోరారు. 
 
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేపట్టే చట్టవిరుద్ధ చర్యలను ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత అని పవన్ అన్నారు. ఏపీలో జనసేన నేతలకు పోలీసుల నోటీసులు విచారకరమని ఆయన తెలిపారు. పోలీసులు నివారణ చర్యల పేరుతో ఇలాంటి ఘటనలు సరికాదని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.