శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (12:01 IST)

ఆళ్ళగడ్డలో మాట్లాడితే పాకిస్థాన్ మీడియాలో వస్తే నన్నేం చేయమంటారు...

ఆళ్ళగడ్డలో మాట్లాడిన మాటలు పాకిస్థాన్ మీడియాలో వస్తే తాను ఏం చేయగలనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రెండేళ్ళ క్రితం యుద్ధం వస్తుందని బీజేపీ తనతో చెప్పిందన్న విషయాన్ని మాత్రమే తాను గుర్తుచేశానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ మీడియాలో వస్తే తానేం చేయగలనని ప్రశ్నించారు. పైగా, తన దేశభక్తిని శంకిస్తారా అంటూ ప్రశ్నించారు. 
 
ఎన్నికల ముందు భారత్‌-పాక్‌ యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే చెప్పారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేగిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'టీడీపీ, వైసీపీ, బీజేపీ సభల్లో ఏనాడైనా జాతీయ జెండాలు కన్పించాయా? ఆ పార్టీల నాయకులు ఏనాడైనా జాతీయ జెండా పట్టుకున్నారా? వాళ్లా దేశభక్తి గురించి మాట్లాడేది? మా సభల్లో మాత్రమే జాతీయ జెండాలు కనిపిస్తాయన్న విషయం గుర్తించుకోండి. ఏ రోజూ నా దేశభక్తిని మీ ముందు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు' అని పవన్ వ్యాఖ్యానించారు. 
 
పైగా, తన మాటలను వక్రీకరించి పదే పదే చూపిస్తుంటారు. భగత్‌సింగ్‌ గురించి మాట్లాడినప్పుడు నేను అన్నది ఏంటి? మీరు చూపించింది ఏంటి? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుపై పరోక్ష విమర్శలు చేశారు. కారుతో ఇద్దరిని గుద్దేసి.. ఒకరు చనిపోతే ఆగకుండా మరో కారులో వెళ్లిపోయిన కనీస మానవత్వం లేని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.