శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 జులై 2017 (18:44 IST)

జనసేన ప్రతినిధులమంటూ పైసలడిగితే తాటతీయండి : పవన్ కళ్యాణ్

పార్టీ శ్రేణులకు హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ ప్రతినిధులమని ప్రచారం చేసుకుంటూ చందాల రూపేణా డబ్బులు అడిగేవారి పట్ల అప్రమతంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయ

పార్టీ శ్రేణులకు హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ ప్రతినిధులమని ప్రచారం చేసుకుంటూ చందాల రూపేణా డబ్బులు అడిగేవారి పట్ల అప్రమతంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ లేఖను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. పవన్ లేఖ యథాతథంగా మీకోసం...
 
"జనసేన పార్టీ అధికార ప్రతినిధులమని కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ జనసేన శ్రేణుల మధ్య గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఈ మధ్యకాలంలో నా దృష్టికి వచ్చింది. ఒకసారి పార్టీ ప్రచార కార్యదర్శిగాను, మరోసారి అధికార ప్రతినిధిని అంటూ మీడియావారితో కూడా పార్టీ తరపున మాట్లాడుతున్నట్టు జనసేన కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కృష్ణా జిల్లాలో అయితే తాను పార్టీ ప్రతినిధినని, విరాళాలు ఇవ్వాలని కూడా ఒకవ్యక్తి కొన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. అందువల్ల ఈ సందర్భంగా జనసేన శ్రేణులు, మీడియా వారికి వాస్తవాలు తెలియజేయడానికి ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాము. 
 
జనసేన తరపున చర్చల్లో పాల్గొనడానికి ఎవరినీ నియమించలేదు. ఆ వ్యక్తులు చెప్పే మాటలు, వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. విరాళాలు అడిగిన వారి వివరాలను పార్టీ కార్యాలయానికి తెలియజేయండి. పార్టీ నిర్మాణం కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నాము. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులనే పార్టీ తరపున ప్రతినిధులుగా నియమిస్తాము. ఆ సమాచారాన్నిఅధికారికంగా తెలియజేస్తాము. ఈలోగా పార్టీ ప్రతినిధులమని ఎవరైనా ప్రచారం చేసుకున్నా, విరాళాలు వంటివి అడిగినా అటువంటి వారి మోసకారి మాటలను విశ్వసించవద్దని తెలుపుతున్నాను. అటువంటివారిపై జనసేన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. జైహింద్" అంటూ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.