సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (08:41 IST)

'పవర్ స్టార్' పంచ్.. తేరుకోలేని టీడీపీ అభ్యర్థులు

ఏపీ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచ్‌లు పడ్డాయి. ఫలితంగా ఏకంగా 30 నుంచి 35 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. పైగా, పవన్ పార్టీ జనసేన భారీగా ఓట్లు చీల్చడంతో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఓటమిని చవిచూసింది. 
 
ఈ నెల 23వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 23 సీట్లు, వైకాపా 151, జనసేన పార్టీ ఒక్క చోట గెలుపొందిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో టీడీపీపై పవన్ కళ్యాణ్ పార్టీ తీవ్ర ప్రభావం చూపింది. నిజానికి గత 2014లో జరిగిన ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఫలితంగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పవన్ ఓటు ఓటు బ్యాంకుతో గట్టెక్కారు. 
 
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు పవన్‌ను టార్గెట్ చేశారు. పవన్ బలం వల్ల తాము గెలవలేదని పదేపదే చెబుతూ వచ్చారు. వీరికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ విధంగా తేరుకోలేని షాకిచ్చారు.
 
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. దీంతో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పంచ ముఖ పోటీ ఏర్పడినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైకాపా, జనసేనల మధ్యే సాగింది. ఫలితాల తర్వాత టీడీపీ ఘోర పరాజయం చవిచూడగా, వైకాపా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు జనసేన కూడా చిత్తుగా ఓడిపోయింది. కేవలం ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకుంది. 
 
అయితే, పవన్ కళ్యాణ్ పార్టీ అనేక నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లను సాధించింది. ఈ కారణంగా దాదాపు 30 నుంచి 35 మంది టీడీపీ అభ్యర్థులు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అనేక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ భారీగా ఓట్లను చీల్చడంతో పాటు జగన్ సునామీ దెబ్బకు టీడీపీ అభ్యర్థులు గల్లంతైపోయారు. మొత్తంమీద తనపై విమర్శలు చేసిన టీడీపీ నేతలకు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సరైన గుణపాఠం చెప్పారు.