ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే గొంతుకోసిస్తా : పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే గొంతు కోసి ఇవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెనాలిలో ఆయన మాట్లాడుతూ, అన్ని వ్యవవస్థల్లో పేరుకునిపోయిన అవినీతిని రూపుమాపేందుకు తనకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పని చేస్తే తాను గొంతు కోసి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
ముఖ్యంగా, అన్నిచోట్లా అవినీతి సర్వసాధారణంగా మారిపోయిందన్నారు. ఆ అవినీతిని భోగి మంటల్లో కాల్చేద్దామని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన నాయకులు ఓట్లు అడగటానికి వస్తే ప్రజలు, యువత వారిని ప్రశ్నించాలని కోరారు. అవినీతి నాయకులకు ఓట్లు వేయకుండా వ్యతిరేకించాలని పవన్ పిలుపునిచ్చారు. తనకు ఓటేసి గెలిపిస్తే మెడ కోసి ఇవ్వడానికైనా సిద్ధమని ప్రకటించారు.
రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెలుగుదేశం, వైకాపలు రెండు విఫలమయ్యాయని పవన్ ఆరోపించారు. త్వరలో రైతుల సమస్యలపై విధాన ప్రకటన చేస్తానని చెప్పారు. ఫిబ్రవరి రెండో వారంలో స్పష్టతనిస్తానమని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు, విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు కావాల్సింది పింఛన్లు, రేషన్ బియ్యం మాత్రమే కాదనీ.. ప్రజలకు మంచి భవిష్యత్తును అందించటమేనన్నారు. దేశానికి వెన్నెముకలాంటి రైతులు ఇక కష్టపడటానికి వీల్లేదన్నారు. వచ్చే నెల 2న రైతులతో సమావేశమై వారి కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించి జనసేన మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు.