దుష్ప్రచారం చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి.. పవన్ ఫ్యాన్స్‌పై షర్మిల ఫిర్యాదు
వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి, వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిల సోమవారం జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు హీరో పవన్ కళ్యాణ్ అభిమానులపై హైదరాబాద్ నగర పోలీసులు అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. పవన్ ఫ్యాన్స్, జనసేన పార్టీ కార్యకర్తలు తమపైనా, తమ కుటుంబ సభ్యులపైనా దుష్ప్రచారం చేస్తున్నారనీ, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఆమె చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కుమార్‌తో పాటు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మరికొందరు వైకాపా నేతలు ఉన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఇరు పార్టీల మధ్య వైరం పెరుగుతోంది. అలాగే ఇరు పార్టీల నేతలు మాటలు తూటాలు పేల్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలపై షర్మిల హైదరాబాద్ సీపీకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. గతంలో కూడా తమపై అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు చేశారనీ, అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.