పిఠాపురంలో 54 గ్రామాలు ఉన్నాయి.. ఏదో ఒక గ్రామంలో స్థిరనివాసం : పవన్ కళ్యాణ్
తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 54 గ్రామాలు ఉన్నాయిని, ఏదో ఒక గ్రామంలో తాను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో పాటు పలువురు నేతలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, జనసేనను, తమ పార్టీ విధి విధానాలను అర్థం చేసుకుని పార్టీలో చేరిన ఇతర పార్టీల నేతలు, న్యాయవాదులు, మేధావులు, విభిన్న వర్గాల ప్రజలకు స్వాగతం పలుకుతున్నానని చెప్పారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి తనను, కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్‌ను గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా పిఠాపురంను తీర్చి దిద్దుతానని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో 54 గ్రామాలు ఉన్నాయని, వాటిలో ఏదో ఒక ఊరిలో ఇల్లు తీసుకుంటానని చెప్పారు. పగిలే కొద్దీ పదునెక్కేది గ్లాసు.. గ్లాసుకు ఓటేయండి.. జనసేనను గెలిపించండి అని ఆయన పిలుపునిచ్చారు. పైగా, వైకాపాకు సౌండ్ ఎక్కువ... గాలి తక్కువ.. అది ఓడిపోయే పార్టీ అని ఆయన పేర్కొన్నారు.
వైకాపా కిరాయి బ్లేడ్ బ్యాచ్ తిరుగుతుంది.. జాగ్రత్త : పవన్ కళ్యాణ్
వైకాపా కిరాయి మూకలు సన్నిటి బ్లేడ్లతో కోస్తున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో వ్యవహరించాలని కార్యకర్తలకు, నేతలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. పిఠాపురం నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తాను అందరినీ కలవాలని భావిస్తాని, అయితే, ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక్కోసారి ప్రోటోకాల్ పాటించకపోతే సమస్యలు వస్తాయన్నారు.
ఇటీవల తనను కలిసేందుకు ఎక్కువ మంది వచ్చినపుడు వారిలో మన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కిరాయి మూకలు కూడా చొరబడ్డారని, సన్నిటి బ్లేడ్ ఉపయోగించి భద్రతా సిబ్బంది చేతులు కోసేశారని, తనను కూడా కోశారని పవన్ వెల్లడించారు. మొన్న పిఠాపురంలో కూడా ఇది జరిగిందని తెలిపారు.
అందువల్ల అందరినీ కలవలేకపోతున్నామని తెలిపారు. అయితే, త్వరలోనే రోజుకు కనీసం 200 మందితో ఫోటోలు దిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేసమయంలో మన ప్రత్యర్థి పన్నాగాలు మీకు తెలుసుకాబట్టి.. అందుకు తగినట్టుగా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.