శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసిహ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత టీడీపీ కూటమి ఇచ్చిన హామీల్లో భాగంగా, సూపర్ సిక్స్ పథకంలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని రకాలైన ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 
 
ఏపీలో 1.55 కోట్ల మందికి దీపం-2 పథకం వర్తింపజేస్తున్నామని తెలిపారు. ఇక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎవరూ నమ్మవద్దని మంత్రి నాదెండ్ల సూచించారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఉచిత గ్యాస్‌కు అర్హులేనని స్పష్టం చేశారు.
 
దీపం పథకం కింద సిలిండర్ బుక్ చేసుకున్న 24 గంటల్లో డెలివరీ ఇస్తారని, లబ్ధిదారుడు చెల్లించిన సొమ్ము 48 గంటల్లోనే తిరిగి వారి ఖాతాలో జమ చేస్తారని వివరించారు. దీపం-2 పథకంపై ఏవైనా సందేహాలు ఉంటే '1967' టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.