బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (20:06 IST)

ఆదాయం కన్నా ప్రజల బాగే ముఖ్యం:ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

మద్య నిషేదం అమలుకు కట్టుబడి అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి తెలిపారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ లోని ప్రచార విభాగంలో శుక్రవారం  ఆయన మాట్లాడారు.

ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారన్నారు. మద్యం వలన ఆయా కుటుంబాల్లో మహిళలు పడుతున్న ప్రధాన సమస్యలను గుర్తించిన అనంతరం నవరత్నాల పథకంలో ముఖ్యమంత్రి మద్య నిషేధం అమలుకు హామీ ఇచ్చారన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

మద్యం వలన అధిక సంఖ్యలో కుటుంబాలు నాశనం అవుతున్న  విషయాన్ని తెలుసుకొని వారి సమస్యకు మద్య నిషేధమే సరైన పరిష్కారమని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ తరుణంలో దశలవారి మద్యనిషేధం దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేసిందని నారాయణస్వామి అన్నారు.

దశలవారి మద్య నిషేధంలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా 20 శాతం మద్యం షాపులను తొలిగించిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో పాటుగా స్పెషల్ డ్రైవ్ పేరుతో 10 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు, అక్రమ మద్య విక్రయ స్థావరాలపై దాడులు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.

గత నెల జనవరిలో 28వ తేదీన కర్నూల్ జిల్లా డోన్, క్రిష్ణగిరి మండలాల్లో నకిలీ మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న స్థావరాలపై దాడులు చేపట్టామని తెలిపారు. ఈ దాడుల్లో 6 వేల నకిలీ ఎంసి విస్కీ సీసాలు, 70 లీటర్ల స్పిరిట్ ను స్వాధీనం చేసుకొని, కారకుడైన ప్రధాన నిందితుడు వినోద్ ఖలాల్ తో సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.

దీంతో పాటుగా ఈ కేసుతో సంబంధం ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన పుట్లూరు శ్రీనుతో పాటు నలుగురిని అరెస్టు చేశామని తెలిపారు. నకిలీ మద్యం తయారీ కేసులో మొత్తం 24 మంది ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేయగా మరో 13 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

గత నెల జనవరి 30న గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం చింతలపూడి గ్రామంలో ఒక వ్యక్తికి చెందిన కోళ్ళఫారమ్ లో కర్ణాటకు సంబంధించిన 60 మద్యం సీసాలను దాడుల్లో పట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కేసులో కడియం కోటి సుబ్బారావు, భూతమేకల మోహనరావులను ఫిబ్రవరి 6న అరెస్టు చేశామని ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఫిబ్రవరి 6న స్పెషల్ డ్రైవ్ దాడులు చేపట్టామని తెలిపారు. ఈ దాడులు మొత్తం 82 గ్రామాల్లో కొనసాగాయని పేర్కొన్నారు. మొత్తం 13 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

10 రోజుల్లో పలు ప్రాంతాల్లో సాగు చేస్తున్న 25 లక్షల 62 వేల 500 గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు. మొత్తం 512 ఎకరాల్లో 3,84,350 కేజీల గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ.76.87 కోట్లు ఉంటుందని మంత్రి వివరించారు.

దీంతో పాటుగా 521 లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేశామన్నారు. నాటు సారా తయారీకి ఉపయోగించే 84,115 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగిందని వెల్లడించారు. అక్రమంగా దాచిన 1482 కేజీల నల్లబెల్లాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మంత్రి పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో 43 వేల బెల్ట్  షాపులుండగా వాటిని తమ ప్రభుత్వం పూర్తిగా తొలగించి ప్రజలకు మేలు చేసిందని ప్రకటించారు. గత రెండేళ్లలో మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు ఆధారాలతో సహా వివరాలు అందించారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎవరేమనుకున్నా తమ ప్రభుత్వం మద్యనిషేదానికి అనుగుణంగా పనిచేస్తుందన్నారు.