హోదా అంశం ఎందుకు సెంటిమెంట్‌గా మారింది? ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?.. జైట్లీతో మోడీ ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై కేంద్ర మంత్రి సుజనాచౌదరి మంగళవారం తనకు అందజేసిన ఐదు పేజీల ముసాయిదాను కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోడీ ముందుంచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై కేంద్ర మంత్రి సుజనాచౌదరి మంగళవారం తనకు అందజేసిన ఐదు పేజీల ముసాయిదాను కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోడీ ముందుంచారు. ఆ సమయలో జైట్లీని ఏపీకి హోదా, ప్యాకేజీలపై ప్రధాని మోడీ ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిసింది. ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? హోదా అంశం ఎందుకు సెంటిమెంట్‌గా మారింది? ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? తదితర ప్రశ్నలను ఆయన అడిగారు.
వీటితోపాటు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, అమరావతి రాజధాని నిర్మాణానికి ఎంత మేరకు కేంద్రం సాయం చేయాలన్న విషయాలన్నింటిపై కూడా మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధానిని కలిసి వివరించినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభం కన్నా, ఏపీకి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వెంకయ్య నొక్కిచెప్పారు.
విభజన కారణంగా అనేక విధాలుగా నష్టపోయిన నవ్యాంధ్రను ఎలా ఆదుకోనున్నారా? అని రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అదేసమయంలో వివిధ అంశాలపై పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయాన్ని కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సవివర చర్చల అనంతరం ఏపీకి ఏమేమి ఇస్తామనే దానిపై "ప్రత్యేక" నివేదిక సిద్ధం చేయడానికి ప్రధాని మోడీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.