శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (18:49 IST)

అమలాపురం అల్లర్లలో 46 మందిపై కేసు

busfire
కోనసీమ జిల్లా పేరు మార్పుపై నెలకొన్న వివాదం నేపథ్యంగా జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి 46 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఎక్కువగా బీజేపీ నేతలతో పాటు కాపు ఉద్యమ నేతల పేర్లు కూడా ఉన్నాయి. అలాగే, ఈ కేసులో మరింతమందిపై కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. 
 
ఇప్పటివరకు నమోదైన కేసుల్లో బీజేపీ కోనసీమ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, అదే పార్టీకి చెందిన నేత రాంబాబు, కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచందర్ రావు కుమారుడు సంజయ్ తదితరులు ఉన్నారు. 
 
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో కోనసీమ జిల్లా ఒకటి. అయితే, ఈ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా తాజాగా మార్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఆందోళన జరిగింది. ఈ అందోళన చేయిదాటిపోవడంతో ఆందోళనకారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై దాడికి యత్నించారు. 
 
ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకున్నారంటూ మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే, కోనసీమ జిల్లా వైకాపా అధ్యక్షుడు పొన్నాడ సతీశ్ ఇళ్లపై నిరసనకారులు దాడి చేసి నిప్పు అంటించారు. ఈ అల్లర్లపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటివరకు 46 మందిపై కేసు నమోదు చేశారు.