శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 25 మే 2022 (14:11 IST)

ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ ఎందుకీ నిరసనలు? అసలేం జరుగుతోంది?

police
ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్వవస్థీరకణ సమయంలో ఆరు జిల్లాలకు కొందరు ప్రముఖుల పేర్లు పెట్టారు. దీనిపై కొందరిలో అసంతృప్తి ఉన్నప్పటికీ, బహిరంగంగా ప్రదర్శించిన దాఖలాలు లేవు. వైఎస్సార్, ఎన్టీఆర్, అల్లూరి, అన్నమయ్య, పొట్టి శ్రీరాములు, సత్యసాయి వంటి పేర్లను జిల్లాలకు పెట్టడం పట్ల చాలామంది సంతోషం వ్యక్తం చేశారు.


అప్పటికే ఉన్న ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ జిల్లాలు అవే పేర్లతో కొనసాగుతున్నాయి. వాటికి తోడుగా కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ వచ్చింది. దాదాపుగా అన్ని ప్రధాన పార్టీలు ఈ ప్రతిపాదనను సమర్థించాయి. ప్రభుత్వం మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అంబేడ్కర్ పేరు పెట్టలేదు. అయితే, నెల రోజులు తిరిగే సరికి పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ వచ్చింది. అదే పెను వివాదంగా మారింది. ఏకంగా జిల్లా ఎస్సీ మీద దాడి, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టే వరకూ వెళ్లింది.

 
కోనసీమ స్వరూపమే కారణమా
ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన అఖండ గోదావరి నది పాయలుగా మారుతుంది. గౌతమి, వైనతేయ, వశిష్ట నదీ పాయల మధ్య ప్రాంతాన్ని కోనసీమ అంటారు. మూడు వైపులా గోదావరి ప్రవాహం, మరోవైపు బంగాళాఖాతం కారణంగా కోనసీమ ఓ దీవిలాగ కనిపిస్తుంది. అయితే, పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని 2009లో ఏర్పడిన అమలాపురం పార్లమెంట్ స్థానాన్ని కొత్త జిల్లాగా రూపొందించారు. దానికి కోనసీమ పేరు ఖరారు చేశారు. అమలాపురం కేంద్రంగా ఏర్పడిన ఈ జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఏడింటిలో మూడు అసెంబ్లీ నియోజవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు. పార్లమెంట్ స్థానం కూడా ఆరంభం నుంచి ఎస్సీ రిజర్వుడుగా ఉంది.

 
2011 లెక్కల ప్రకారం 18 లక్షల మంది జనాభాతో ఏర్పడిన ఈ జిల్లాలో సుమారుగా 5 లక్షల మంది ఎస్సీ జనాభా ఉంటారు. ఇంచుమించు అదే సంఖ్యలో కాపు, ఆ తర్వాత శెట్టిబలిజతో పాటుగా మత్స్యకార కులాలకు చెందిన బీసీలు ఉన్నారు. కులాల వారీగా, సంఖ్య రీత్యా మూడు, నాలుగు కులాలకు చెందిన ప్రజలు దాదాపు సమానంగా ఉండడమే కాకుండా, ఆర్థికంగా, రాజకీయంగా పట్టు కోసం ఆయా కులాలకు చెందిన వారి మధ్య పోటీ సుదీర్ఘకాలంగా కనిపిస్తోంది. ఈ సామాజిక, ఆర్థిక స్వరూపమే కోనసీమలో పలుమార్లు వివాదాలకు ప్రధాన కారణమని పలువురు చెబుతుంటారు.

 
కుల ఘర్షణలకు కేంద్రంగా...
ప్రస్తుతం కోనసీమ జిల్లాగా ఉన్న ప్రాంతంలో గతంలో అనేక కుల ఘర్షణలు జరిగిన చరిత్ర ఉంది. పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థుల మధ్య ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు కూడా చినికి చినికి గాలివానలా మారిన నేపథ్యం ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి వారి విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు 8 ఏళ్ల క్రితం కోనసీమలో తీవ్ర కలకలం రేగింది. వరుసగా పలు విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలు అప్పట్లో దుమారం రేపాయి. ప్రస్తుతం ఈ జిల్లాలో ముగ్గురు ఎస్సీ మాల, ఒక మత్స్యకార, ఒక శెట్టిబలిజ, ఒక కమ్మ, ఒక రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో పినిపే విశ్వరూప్ (ఎస్సీ), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (శెట్టిబలిజ) మంత్రులుగా ఉన్నారు. కానీ, రాజకీయంగా కాపు కులస్తులు అన్ని నియోజకవర్గాల్లో హవా చాటుతూ ఉంటారు. ఈ రాజకీయ వైరుధ్యాల మూలంగా కుల ఘర్షణలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

 
ఇటీవల మంత్రి వేణుగోపాలకృష్ణ తీరు మీద శెట్టిబలిజ కులస్తులు ఆందోళనకు దిగారు. మరో మంత్రి విశ్వరూప్ వైఖరిపై ఆయన సొంత కులస్తులే అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుత ఆందోళనల వెనుక ఈ రాజకీయ విభేదాల ప్రభావాన్ని కూడా తోసిపుచ్చలేమని జర్నలిస్ట్ పీతల రాజశేఖర్ అన్నారు. వ్యవసాయ రంగంలో ఈ ప్రాంతం ముందంజలో ఉంది. అయితే, కుల విబేధాలు పలుమార్లు హద్దులు దాటడంతో కోనసీమ సున్నిత ప్రాంతంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ చిన్న వివాదం రాజుకున్నా, వేగంగా విస్తరిస్తుందని పోలీసు రికార్డులు చెబుతాయి.

 
అంబేడ్కర్ జిల్లా మీద అభ్యంతరాలెందుకు?
దేశంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అంబేడ్కర్ పేరుతో జిల్లాలున్నాయి. వివిధ ఉన్నత సంస్థలు ఆయన పేరు పెట్టుకున్నాయి. కానీ, కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన పెను వివాదంగా మారింది. తొలుత ప్రభుత్వం అంబేడ్కర్ పేరు విషయంలో స్పందించలేదు. దాంతో, సుమారు మూడు నెలల పాటు ఆందోళన సాగింది. జిల్లాల విభజన ప్రతిపాదన ముందుకొచ్చిన తర్వాత, జనవరి నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకూ వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టారు.

 
అమలాపురం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే నినాదంతో దీక్షలు, ర్యాలీలు, లాంగ్ మార్చ్ వంటివి కూడా జరిగాయి. వీటిలో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, పలు సంఘాలు పాల్గొన్నాయి. జనసేన పార్టీ నేరుగా దీక్షలకు పూనుకుంది. అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంకి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తాళ్లరేవులో మే మొదటి వారంలో జరిగిన సభలో అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ కూడా ఈ డిమాండ్‌ను బలపరుస్తున్నట్టు ప్రకటించింది. అన్ని పార్టీలు అంబేడ్కర్ పేరును కోరినప్పటికీ ఆయా పార్టీల కార్యకర్తలంతా వ్యతిరేకిస్తున్నట్టు కోనసీమకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ టీకే విశ్వనాథం అంటున్నారు.

 
"నాయకుల మాటలకు, ఆచరణకు పొంతనలేదు. చాలామంది నాయకులు బహిరంగంగా బలపరిచి, అంతర్గతంగా యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంబేడ్కర్ పేరును తప్పించి, కోనసీమ పేరుతోనే జిల్లా ఏర్పడడంతో అంతా సర్థుమణిగిందని అనుకున్నారు. కానీ, ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా, ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పటికే ప్రతిపక్ష నేత డిమాండ్ చేయడం పాలకపక్షం నేతల్లో ఒత్తిడిని పెంచింది. దానిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిని ఏకపక్ష చర్యగా ఇతరులు భావిస్తున్నారు. నాన్ ఎస్సీ కులాలలో వ్యతిరేకత వచ్చింది" అంటూ ఆయన వివరించారు. ఎస్సీలు, ఇతర కులాల మధ్య ఉన్న విభేదాలు ఈ వివాదంలో ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. అంబేడ్కర్ జిల్లా ఏర్పాటుకు ఈ స్థాయిలో ఆగ్రహం పెల్లుబికడానికి దీర్ఘకాలంగా ఉన్న వివాదాలే కారణమని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు.

 
కావాలని, వద్దంటున్న వారి వాదనలు ఏంటి?
అంబేడ్కర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని వివిధ రూపాల్లో జరిగిన కార్యక్రమాలకు మాజీ ఎంపీ హర్షకుమార్ నేతృత్వం వహించారు. "అంబేడ్కర్ జిల్లా ఉండాలని అంతా ఆశించారు. అన్ని వర్గాలు మద్ధతునిచ్చాయి. ఉద్యమం జరిగింది. ప్రభుత్వం నుంచి మాత్రం ఉలుకుపలుకు లేదు. ఏ లక్ష్యంతో ఈ ప్రతిపాదన చేసారన్నది చెప్పడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం అంబేడ్కర్ పేరుతో ఇలాంటి యత్నాలు మంచిది కాదు. విద్వేష చర్యలకు ఎవరూ దిగకూడదు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ పరిణామాలు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

 
"కోనసీమ ఖరారు చేశారు కదా.. డొక్కా సీతమ్మ వంటి వారి పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయినా కోనసీమ అనే ఉంచారు. అదే ఉంచాలని మేం కోరుతున్నాం. హఠాత్తుగా పేరు మార్చడంలో ఆంతర్యం ఎవరికీ అంతుబట్టడం లేదు. అంబేడ్కర్ పేరు కావాలంటే ఎక్కడైనా పెట్టుకోండి. మాకు అభ్యంతరం లేదు. కానీ ఖాయం చేసిన పేరు మార్చడం ఎవరికీ ఇష్టం లేదు" అన్నారు ఆజాద్ యూత్ అసోసియేషన్ ప్రతినిధి కిరణ్ కుమార్. కోనసీమ జిల్లా ఉంచాలని ఈ అసోసియేషన్ పోరాడుతోంది.

 
ప్రాథమిక నోటిఫికేషన్ రావడంతోనే..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 16న నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి వివాదం మలుపు తీసుకుంది. అప్పటికే అంబేడ్కర్ పేరుతో జిల్లా డిమాండ్ చేసిన వారంతా తమ కోరిక సాకారం కాలేదనే అసంతృప్తితో ఉన్నారు. కానీ, అనూహ్యంగా నోటిఫికేషన్ రావడంతో వారంతా సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు.

 
ఆ సమయంలోనే కోనసీమలోని పలు గ్రామాల్లో వివాదాలు మొదలయ్యాయి. అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తున్న వారంతా సోషల్ మీడియాలో తమ నిరసనలు తెలియపరచడం ప్రారంభించారు. దానికి క్షేత్రస్థాయిలో ప్రతిఘటన వచ్చింది. ఒకటి, రెండు గ్రామాల్లో యువకులు కొందరు అంబేడ్కర్‌ను అవమానించారంటూ ఆందోళనలకు దిగారు. ఆయా గ్రామాల్లో పెద్దలు రాజీ కుదిర్చి, అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు కూడా చేయించారు. దాంతో సమస్య సర్థుమణిగిందని భావించారు. కానీ అసంతృప్తులు, వ్యతిరేకతలు జిల్లా కేంద్రానికి చేరాయి. మే 19 నాడు అమలాపురం కలెక్టరేట్‌ను వేల మంది ముట్టడించారు. ఆ సందర్భంగా కొందరు ఆత్మాహుతియత్నం చేయడం ఉద్రిక్తతలు రేకెత్తించింది.

 
"గ్రామాల్లో పలు చోట్ల అంబేడ్కర్ జిల్లా అనుకూలురు, వ్యతిరేకుల మధ్య విభజన ఏర్పడింది. దానిని సకాలంలో ప్రభుత్వం గుర్తించలేదు. చిన్న ఘర్షణలుగా పరిగణించింది. వాటిని అణచివేయడంలో జరిగిన తాత్సార్యం చివరకు విధ్వంసానికి దారితీసింది. సోషల్ మీడియా కేంద్రంగా పిలుపునిచ్చి 'ఛలో అమలాపురం' చేపడుతున్నట్టు సాగిన ప్రచారం వెనుక గుట్టుని ఇంటిలిజెన్స్ గుర్తించలేకపోయింది. ప్రణాళిక ప్రకారం ఒక్కసారిగా వీధుల్లోకి యువత రావడాన్ని పోలీసులు అంచనా వేయలేకపోయారు. చివరకు ఎస్పీ మీద దాడి చేసినా, నియంత్రించే నాథుడే లేడు. పోలీసులు కఠినంగా వ్యవహరించవద్దనే ఆదేశాలు రావడంతో చేతులుడిగి చూస్తుండిపోయారు" అంటూ అమలాపురం పట్టణానికి చెందిన ఎం వాసుదేవరావు వివరించారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తగులబెడుతున్న సమయంలో కూడా పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

 
తుని ఘటనలను తలపించేలా...
కాపు రిజర్వేషన్లు కోరుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే తుని కేంద్రంగా 2015లో ఉద్యమం చేపట్టారు. ఆ సమయంలో అల్లర్లు జరిగాయి. ఏకంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. రైలు తగులబెట్టిన కేసులో నిందితులకు శిక్షలు పడిన దాఖలాలు ఇప్పటికీ లేవు. సరిగ్గా ఏడేళ్లకు కోనసీమ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనలు, తుని ఘటనలను తలపించేలా ఉన్నాయని ఆ ఉద్యమాన్ని కవర్ చేసిన జర్నలిస్ట్ ఎం లక్ష్మణ్ వాదన.

 
"చాలామంది అన్నీ సిద్ధం చేసుకుని వచ్చారు. రాళ్లు వెంట తెచ్చుకున్నారు. ప్యాకెట్లలో పెట్రోల్ నింపి తీసుకొచ్చారు. విశ్వరూప్ ఫ్లెక్సీలను, వైసీపీ నాయకుల ఇళ్లను టార్గెట్‌గా ముందే నిర్ణయించుకున్నారు. ఎవరి ఇల్లు ఎక్కడ ఉందన్నది తెలుసుకున్నారు. నేరుగా అక్కడికే వెళ్లి తగులబెట్టారు. పైగా ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇంటిని తగులబెడుతున్నప్పుడు ఆయన కుటుంబం ఇంట్లోనే ఉంది. అయినా ఎవరూ ఆపలేకపోయారు. ఎమ్మెల్యే, ఆయన భార్య బయటకు పరుగులు పెట్టాల్సివచ్చింది. విశ్వరూప్ ఇంట్లో పనివారికి గాయాలయ్యాయి. ఇదంతా వ్యూహాత్మకంగానే జరిగింది తప్ప అప్పటికప్పుడు ఆవేశంతో జరిగింది కాదని స్పష్టమవుతోంది" అంటూ అమలాపురం వాసి వంకా రవీంద్ర అభిప్రాయపడ్డారు.

 
వీధుల్లోకి వచ్చిన వారిని అదుపుచేయడానికి అవసరమైన సిబ్బంది లేరు, ఉన్న వారు కూడా తగిన చర్యలు తీసుకోవడానికి అనుమతి లేదంటూ కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి అని ఆయన అన్నారు. సరిగ్గా తునిలో జరిగిన మాదిరిగానే మీడియా ప్రతినిధులపై దాడులు, ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో విధ్వంసం వంటివి స్పష్టంగా కనిపించాయి.

 
రాజకీయ నేతలే చొరవ చూపాలి
"అమలాపురం ఘటనకు అన్ని ప్రధాన పార్టీల నేతలు బాధ్యత వహించాలి. ఉద్యమం అదుపు తప్పుతుందని తెలిసి, యువతను వారించేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. కనీసం తమ పార్టీ శ్రేణులకు సంయమనం పాటించాలని కూడా చెప్పలేదు. అదే సమయంలో అధికార పార్టీ నేతల్లో విబేధాలు ఇంత స్థాయికి వెళ్లడానికి పురిగొల్పాయి. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం, ప్రధాన పార్టీల నిర్లక్ష్యానికి చెల్లించుకోవాల్సిన ప్రతిఫలంగా కనిపిస్తోంది. ఇంతటి విధ్వంసం మూలంగా కోనసీమ వాసుల పట్ల రాష్ట్రమంతా వ్యతిరేకత వస్తుంది. కులాల కుంపట్లలో కొట్టుకుంటున్నారనే అపకీర్తి పెరుగుతుంది. దీనిని అందరూ గుర్తించాలి. సంయమనంతో ఉండాలి. రాజకీయ పార్టీల నేతలంతా ముందుకొచ్చి, కార్యకర్తలను శాంతింపజేయాల్సిన అవసరం ఉంది" అంటున్నారు రిటైర్డ్ లెక్చరర్ సలాది రామచంద్రరావు.

 
కోనసీమలో కుల వైరుధ్యాలు ఇటీవల కాలంలో ఎన్నడూ ఇంత బహిరంగంగా బయటపడలేదని ఆయన అంటున్నారు. జిల్లా పేరు ఏదైనా సామాన్యులకు ఒరిగేదేమీ లేకపోయినప్పటికీ, భావోద్వేగాలు రెచ్చగొట్టిన ఫలితమే ఈ పరిణామాలకు దారి తీసిందని ఆయన అభిప్రాయపడ్డారు. మే 24 నాడు జరిగిన ఘటనలకు పోలీసు, నిఘా యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం ప్రధాన వైఫల్యం అనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. విధ్వంసకర ఘటనల తర్వాత పోలీసు యంత్రాంగం కదిలింది. డీఐజీ సహా పలువురు ఉన్నతాధికారులు హుటాహుటిన అమలాపురం చేరుకుని పరస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను మోహరించారు.