బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 మే 2022 (21:13 IST)

మంటల్లో ఏపీ మంత్రి ఇల్లు: ఈ పరిస్థితికి కారకులెవరు అంటూ ప్రశ్నించిన పవన్ కల్యాణ్

pawan kalyan
అమలాపురంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనను అందరూ ఖండించాలన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.


పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మహనీయులను అడ్డుపెట్టుకుంటున్నారనీ, తమ చేతకానితనాన్ని పార్టీలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి కారకులు ఎవరో జిల్లా ప్రజలకు, రాష్ట్ర పజలకు తెలుసనని అన్నారు.

 
కోనసీమ జిల్లా పేరు మార్పుతో అమలాపురం అగ్నిగుండంలా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ మంగళవారం వందలాది మంది యువకులు నిరసనలు చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.


కోనసీమ జిల్లా సాధన సమితి బ్యానర్‌ ఆధ్వర్యంలో యువకులు క్లాక్‌ టవర్‌ జంక్షన్‌ వద్ద బైఠాయించి ‘కోనసీమ జిల్లా ముద్దు... వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో కొందరు తప్పించుకుని కలెక్టరేట్ వైపు పరుగులు తీయడంతో పోలీసులు వారిని వెంబడించారు.

 
ఐతే వీరికి మరికొందరు తోడవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. వారంతా కలిసి మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రి ఇంటి వద్ద వున్న ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు ద్విచక్రవాహనాన్ని తగులపెట్టారు.

 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కోనసీమ జిల్లా పేరును ‘డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా’ అని మార్చింది. అభ్యంతరాలు, సూచనలు ఏమైనా ఉంటే 30 రోజుల్లోగా కలెక్టర్‌కు సమర్పించాలని కోరారు. కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని కోరుతున్న కొందరు యువకులు తమ డిమాండ్ల సాధనలో ఆందోళనకు దిగారు.