జగన్ ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అనే వ్యక్తి కిడ్నాప్ కేసు పోలీసులకు ఛాలెంజిగ్‌గా మారింది. ప్రకాశం జిల్లా కంభం అర్ధవీడు మండలం నాగులవరానికి చెందిన జగన్ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. జేసీబీలు, ట్రాక్టర్లు, డ్రోజర్లు అద్దెకిస్తూ కంభం ఏరియాలో నివసిస్తున్నాడు. అతని భార్య రజనీ పక్కింట్లో ఉన్న డాక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం జగన్‌కి తెలిసిపోవడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని డాక్టర్‌తో కలసి రజనీ పథకాన్ని రచించినట్టు సమాచారం. ఇందులోభాగంగా మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి డాక్టర్ ఇంటికి వచ్చాడు. తాను కర్నూలు జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ అని పరిచయం చేసుకున్నాడు. వివాదాన్ని పరిష్కరిస్తానంటూ నమ్మబలికి జగన్‌ని కారులో ఎక్కించుకుని వెళ్లాడు. ఆ తర్వాత జగన్ జాడ తెలియరాలేదని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చివరగా ఇంటికి వచ్చిన వ్యక్తితో జగన్ కారులో బయటకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా తెలుస్తోంది. మార్గమధ్యంలో డాక్టరు కూడా ఎక్కాడు. ముగ్గురూ రావిపాడు రోడ్డు మీదుగా గొట్లగట్టు వైపు వెళ్లారు. ఆ తర్వాతి రోజు డాక్టర్ తిరిగి రజనీ వద్దకు వచ్చినట్లు సీసీటీవీలో రికార్డైంది. కొడుకు ఆచూకీ కోసం జగన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు డాక్టర్ కాల్‌డేటా ఆధారంగా చేసుకుని అతడే జగన్ కిడ్నాప్‌కి ప్రణాళిక రచించాడని నిర్ధారించారు.
డాక్టర్‌తో పాటు రజనీని, అలాగే పోలీసు కానిస్టేబుల్ అని చెప్పిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే జగన్‌ను కిడ్నాప్ చేసి ఎక్కడైనా దాచి పెట్టారా? లేక తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చంపేశారో ఇంకా తెలియాల్సి ఉంది. వారిని ఎంతగా ప్రశ్నించినా జగన్ ఆచూకీ చెప్పకపోవడం కొసమెరుపు.