శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

చిత్తుగా ఓడిపోవడానికి గోతులే ప్రధాన కారణం: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

karanam dharmasri
గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ముఖ్యంగా తాను భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడానికి ప్రధాన కారణం రహదారులపై ఉన్న గోతులే ముఖ్య కారణమని, వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అభిప్రాయపడ్డారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమికి గల కారణాలను వెల్లడించారు. ఎన్నికల్లో తన ఓటమికి రహదారి గోతులే కారణమన్నారు. ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. గత ఐదేళ్ల పాలనలో అనేక తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ప్రజలు ఓటర్లు తమను చిత్తుగా ఓడించారని చెప్పారు.
 
తన నియోజకవర్గ అభివృద్ధి కోసం సొంత నిధులను రూ.2 కోట్లకుపైగా ఖర్చు చేశామని, ఇపుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఆ నిధులను మంజూరు చేస్తుందో లేదో తెలియదన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో తెలిసో తెలియకో పలు తప్పులు చేశామని, ఈ కారణంగా ప్రజలు తమను అధికారానికి దూరంగా ఉంచారని తెలిపారు. ఇపుడు టీడీపీ, జనసేన, బీజేపీ పాలకులు ఇవే తప్పులు చేసి ప్రజల ఆగ్రహానికి గురికావొద్దని ఆయన హితవు పలికారు. 
 
అలాగే, వైకాపా సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఒకటే చెబుతున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికి వారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అయితే, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోతే వెళ్ళడం వెళ్లకపోవడం అనేది మీ వ్యక్తిగత విషయమని కరణం ధర్మశ్రీ అభిప్రాయపడ్డారు.