గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (18:31 IST)

బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారన్న ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్

బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలది అవినీతి పాలనే అని ఆరోపించారు.
 
 
తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో పోలవరానికి అన్ని అనుమతులు వచ్చాయని వెల్లడించారు. అనుమతులు ఇచ్చి ఏడేళ్లయినా పోలవరం పూర్తిచేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి కోసం అటవీభూములను బదిలీ చేశామని చెప్పారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో కొన్ని సమస్యలు గుర్తించానని అన్నారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందని తెలిపారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.
 
 
ఏపీలో చాలామంది నేతలు బెయిల్ పై బయట ఉన్నారని జవదేకర్ వ్యాఖ్యానించారు. బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారని అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం అని చెప్పి, ఇప్పుడు మద్యంపై వచ్చే డబ్బుతోనే పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు.
 
 
అయోధ్యలో గొప్పగా రామాలయం నిర్మిస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వారణాసి, చార్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాల రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితి బాగా లేదని, అంతర్వేదిలో రథం దగ్ధమైందని, రామతీర్థంలో స్వామివారి విగ్రహాన్ని విరగ్గొట్టారని మండిపడ్డారు. ప్రకాశ్ జవదేకర్ ఆంగ్లంలో ప్రసంగించగా, పురందేశ్వరి తెలుగులో అనువదించారు