శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 9 నవంబరు 2021 (11:13 IST)

ప్రధానమంత్రి మాతృ వందన యోజన....తల్లీ, బిడ్డలకు ఆరోగ్యం!

కేంద్ర ప్ర‌భుత్వం త‌ల్లీ, బిడ్డ‌ల ఆరోగ్యం కోసం ప్రవేశ‌పెట్టిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన గ్రామీణ ప్రాంతాల్లో స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది. మహిళాభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైనది ప్రధానమంత్రి మాతృ వందన యోజన. తల్లీబిడ్డల సంక్షేమం కోసం అమలు చేస్తున్నఈ పథకం మహిళల పాలిట వరంలాంటిది. 
 
 
మహిళ గర్భందాల్చిన నాటి నుంచి బిడ్డకు జన్మనించేంత వరకు, తరువాత తల్లీ,బిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతో పాటు అవసరమైన మందులు, పోషకాహారం ఈ ప‌థ‌కం ద్వారా అందిస్తారు. అంతేకాక, 5వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం కూడా అందిస్తారు. గర్భం దాల్సిన సమయంలో వారు పనులకు వెళ్లలేని సమయంలో, వారికి అండగా నిలవడానికి ఈ సహాయం అందిస్తున్నారు. దీనితో పాటు గర్భిణులకు స్కానింగ్,రక్తపరీక్షలు వంటివాటిని ఉచితంగా చేస్తున్నారు. మామూలు వైద్యులతో పాటు ప్రతి నెలా ఒకరోజు నిపుణులైన వైద్యులతో అవసరమైన వారికి ప్రత్యేక పరీక్షలు చేయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అందుతున్న ఈ సౌకర్యాలు మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 
 
ప్రకాశం జిల్లాలో ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో 12వేల 500 మంది లబ్ది పొందారని ప్రకాశం జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ వాణిశ్రీ తెలిపారు. 2017 నుంచి ఇప్పటివ వరకు 85 వేల 540 మంది మహిళలు ఈ పథకం కింద లబ్ది  పొందారు. ఈ పథకం తమకు ఎంతో ఉపయోగపడిందని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంతో బాగా చూసుకుంటున్నారని, మందుల, స్కానింగ్ పరీక్షలు సమయానికి చేస్తున్నారని, ప్రధానమంత్రి మాతృవందన పథకం కింద తమకు ఆర్ధిక సహాయం కూడా అందిందని పలువురు మహిళలు ఆనందంగా చెప్పారు. ప్రభుత్వం అందించిన డబ్బుతో మంచి ఆహారం తీసుకున్నామని దీనివల్ల తాము ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తమ బిడ్డలకు కూడా మంచి ఆహారం అందించామని తెలిపారు.