కల నెరవేరింది... 44 మంది అబ్కారీ సిఐలకు, 84 మంది ఎస్ఐలకు ప్రమోషన్
పదోన్నతి వారి కల. తమ సర్వీసు కాలంలో దానిని అందుకోగలమా అన్న సంశయం వారిలో ఉండేది. ఇప్పుడు అది నెరవేరింది. దాదాపు ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత అబ్కారీ శాఖ అధికారులలో సంతోషం వెల్లివిరుస్తోంది. 44 మంది అబ్కారీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు అదనపు ఎక్సైజ్ సూపరిండెంట్‌లు కాబోతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ దస్త్రం ఎన్నికల కోడ్ నేపధ్యంలో రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు ద్వారా స్క్రీనింగ్ కమిటీకి చేరింది.
ఈ కమిటీలో సిఎస్‌తో పాటు సంబంధిత కార్యదర్శి, జిఎడి కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. స్ర్కీనింగ్ కమిటీ ఆమోదం తరువాత కమీషన్ అనుమతికి లోబడి వారికి త్వరలో పోస్టింగ్‌లు దక్కనున్నాయి. ఈ నేపధ్యంలో శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర అబ్కారీ కేంద్ర కార్యాలయంలో కమీషనర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రోహిభిషన్, ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోషియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహులు, కార్యదర్శి వెంకట రమణ తదితరులు మాట్లాడుతూ విభిన్న కారణాలతో పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావటంలో కమీషనర్ పాత్ర ఎనలేనిదన్నారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పదోన్నతుల వ్యవహారాన్ని చేపట్టారని అందుకు తాము రుణపడి ఉంటామని హామీ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖలో పదోన్నతుల వ్యవహారం పలు చిక్కుముడులతో బిగుసుకుపోగా మీనా రెండోసారి కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తదుపరి ఈ విషయంపై కీలకంగా దృష్టి సారించారు. చివరిసారిగా 2012లో ఎక్సైజ్ సిఐలు ఎఇఎస్‌లుగా పదోన్నతులు పొందగా, దాదాపు ఏడు సంవత్సరాల తరువాత ఇప్పుడు అవకాశం లభించినట్లు అయ్యింది. ఈ పరిణామం వల్ల అబ్కారీ కమీషనరేట్ పరిధిలో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఇప్పటికే ఉన్న సిఐ ఖాళీలకు తోడు, పదోన్నతుల వల్ల ఖాళీ అవుతున్న స్థానాలతో కలిపి సిద్ధం అవుతున్న దాదాపు 84 ఖాళీలలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌లకు పదోన్నతులు లభించనున్నాయి. ఇదే స్థాయిలో కానిస్టేబుల్స్ హెడ్‌లుగానూ, హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ఐలుగానూ పదోన్నతులు పొందనున్నారు. వీటిని సైతం త్వరితగతిన పూర్తి చేసి ఎక్సైజ్ అధికారులలో ఉత్సాహం నింపాలని కమీషనర్ యోచిస్తున్నారు.
ప్రస్తుతం మల్టీజోన్ వన్ నుండి 25 మంది, మల్టీ జోన్ రెండు నుండి 19 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్‌లుగా అవకాశాలు పొందుతారు. మల్టిజోన్ వన్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు ఉండగా, మల్టీజోన్ రెండులో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. నిజానికి 2004లో సీనియారిటీ జాబితాలను విడుదల చేయగా, తదుపరి జాబితాలను సిద్ధం చేయలేదు. వివిధ జోన్‌ల నడుమ మల్టిజోన్ సినియారిటీ లిస్టు తయారీలో పలు అవాంతరాలు ఏర్పాడ్డాయి. ఈ వ్యవహారంలో నోడల్ డిసిలు కీలకం కాగా పాలనాపరమైన సమస్యలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ గాడిలో పెట్టిన కమీషనర్ ఎట్టకేలకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషనల్ కమిటీని సమావేశపరిచి పదోన్నతులకు మార్గం సుగమం చేసారు.