గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (10:36 IST)

ఏపీలో నేడు - రేపు వర్షాలు .. పులిచింతల రెండు గేట్లు ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, రేపు విస్తారంగా వానలు కురవనున్నాయి. కోస్తాలో నేడు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల మాత్రం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. 
 
అలాగే, కోస్తా తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోపక్క, బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉన్నట్టు వివరించింది. దీని ప్రభావంతో రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్‎లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో పులిచింతల ప్రాజెక్ట్‎కు భారీగా వరద రావడంతో మూడు గేట్లను అధికారులు ఎత్తివేశారు. 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 
 
ప్రస్తుతం ప్రాజెక్టులో 44.03 టీఎంసీల నీరు ఉండగా..జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 26వేల క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.
 
మరోవైపు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 87,521 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను… ప్రస్తుతం  847.60 అడుగులకు చేరింది.