గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 2 నవంబరు 2021 (15:36 IST)

పంచ్ ప్ర‌భాక‌ర్ అరెస్ట్ పై ... మరోసారి సీబీఐపై హైకోర్టు ఆగ్రహం!

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరోసారి సీబీఐపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం  చేసింది. పంచ్ ప్ర‌భాక‌ర్ కేసు విషయంపై మంగళవారం ధర్మాసనం ముందు అత్యవసర విచారణ జరిగింది. రిజిస్టార్ జనరల్ నుంచి లెటర్ వచ్చిన వెంటనే ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్‌ ఖాతాల నుంచి పంచ్ ప్రభాకర్ పోస్ట్లు తొలగించి, బ్లాక్ చేశారని ధర్మాసనం దృష్టికి స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ తీసుకువెళ్లారు.  తాము కూడా లెటర్ రాశామని సీబీఐ పేర్కొంది. దీంతో తమరు  లెటర్ రాసి ఉపయోగం ఏమిటని సీబీఐను ధర్మాసనం ప్రశ్నించింది. 

 
పంచ్ ప్రభాకర్‌ను ఎలా పట్టుకుంటున్నారో చెప్పాలని సీబీఐను కోర్టు కోరింది. సరైన సమాధానం రాకపోవటంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మేము చెప్పింది మీరు వినకపోతే మీరు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏం చెయ్యాలో తామే ఆదేశాలు ఇస్తామన్న న్యాయస్థానం తెలిపింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించే యోచన చేస్తామని పేర్కొంది.

 
కోర్టులో విచారణ తరువాత పంచు ప్రభాకర్ గూగుల్‌లో తన ఫోటోతో సహా చిరునామా పెట్టారని ధర్మాసనం దృష్టికి  స్టాండింగ్ కౌన్సిల్ అశ్విని కుమార్ తీసుకువచ్చారు. ఈ కేసును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసని ధర్మాసనం తెలిపింది. సాయంత్రానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.