గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (14:07 IST)

వైకాపాను వీడనున్న మరో రాజ్యసభ సభ్యుడు!

rkrishnaiah
గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ఆ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. మరికొందరు అదే దారిలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ రాజ్యసభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. 
 
తెలంగాణ రాష్ట్రంలో గత యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ ఈ విషయంలో మరింతగా ముందుకెళ్లాలని భావిస్తోంది. అందులోభాగంగా బీసీల్లో పట్టున్న సీనియర్ నేత ఆర్.కృష్ణయ్యను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం కృష్ణయ్యతో జరిపిన చర్చలు ఫలించినట్టు తెలిసింది.
 
ఇదే విషయంపై పార్టీ జాతీయ అగ్రనేత జరిపిన ఈ చర్చలు ఫలవంతమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఆయనకు కీలక పదవి ఇవ్వనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఆర్.కృష్ణయ్య దాదాపు పదేళ్లపాటు ఆరెస్సెస్, ఏబీవీపీలో పనిచేసిన నేపథ్యంలో ఆ సంస్థ ముఖ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. 
 
ఈ నెల 13న కృష్ణయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఆయన పార్టీలో చేరబోతున్నారన్న వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా, ఇప్పటికే వైకాపాకు చెందిన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు తమతమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో పాటు వైకాపాకు కూడా గుడ్‌బై చెప్పిన విషయం తెల్సిందే.