ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (15:05 IST)

వైకాపాపై వైఎస్ షర్మిళ ఎఫెక్ట్ : 5 నుంచి 7 శాతం ఓట్లు చీలిపోవచ్చు : ఆర్ఆర్ఆర్

raghurama krishnam raju
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టడం వల్ల అధికార వైకాపాకు అపార నష్టం తప్పదని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు జోస్యం చెప్పారు. వైకాపా ఓట్లు 5 నుంచి 7 శాతం మేరకు చీలిపోతాయని తెలిపారు. 
 
సంక్రాంతి సంబరాల కోసం ఆయన తన సొంత నియోజకవర్గానికి సుధీర్ఘకాలం తర్వాత ఆయన వచ్చారు. ఈ సందర్భంగా భీమవరం మండలం, రాయలం గ్రామంలో టీడీపీ, జనసేన పార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ సమావేశాలు తర్వాత తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. 
 
వైకాపా పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. ఎన్నికలు ఎపుడు జరుగుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, వైకాపాను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 
 
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి ఏకంగా 135 నుంచి 155 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టడం వల్ల వైకాపాకు 5 నుంచి 7 శాతం మేరకు ఓట్లు చీలిపోతాయని చెప్పారు.