హస్తిన కేంద్రంగా ఆర్ఆర్ఆర్ లేఖాస్త్రాలు - ఈ దఫా గవర్నర్లకు...
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో కూర్చొని తనపై ఏపీ సీఐడీ పోలీసులు రాజద్రోహం కేసును సుమోటా నమోదు చేయడం, ఈ కేసులో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే ఒక్క ఏపీ సీఎంకు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. మంగళవారం దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు రఘురామ లేఖ రాశారు. త్వరలో గవర్నర్ల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో, సెక్షన్ 124ఏ రద్దు చేసే అంశంపై ఆ సదస్సులో చర్చించాలని రఘురామ తన లేఖలో కోరారు.
ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసి దారుణంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు.... తన ఆక్రోశాన్ని లేఖల రూపంలో వెలువరిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, రాజద్రోహం సెక్షన్ దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తావించినందుకు తనపై కేసులు పెట్టారని వివరించారు. అక్రమ కేసులతో వేధించారని తెలిపారు. ఏపీ సీఎం వ్యక్తిగత కక్షతో తనపై కేసులు పెట్టించారని ఆరోపించారు. ఏపీ సీఐడీ కార్యాలయంలో సీఐడీ డీజీ నేతృత్వంలో తనను క్రూరంగా హింసించారని తెలిపారు.
ఓ సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం నేరం మోపడం, ఓ ఎంపీని కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం ఇదే తొలిసారి అని రఘురామ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లానని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే గవర్నర్ల సదస్సులో మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాగా, రాజద్రోహం కేసులో అరెస్టు అయిన రఘురామరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే.