శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (13:50 IST)

జగన్ గారూ.. వారి కుటుంబాలను ఆదుకోవాలి: రమణ దీక్షితులు

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోంది. టీటీడీలో ఇప్పటి వరకూ 743 మంది కరోనా బారిన పడ్డారు. ఇద్దరు అర్చకులూ కన్నుమూశారు. తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు కరోనా వల్ల మరణించారు. 
 
ఆ విషాదం నుంచి టీటీడీ అర్చకులు, వారి కుటుంబాలు కోలుకోలేకముందే.. మరొకరు కరోనా కోరల్లో చిక్కుకుని తుదిశ్వాస విడిచారు. తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డెప్యుటేషన్‌పై తిరుమలకు వచ్చిన అర్చకుడు కరోనా వైరస్ వల్ల మృతిచెందారు.
 
ఈ పరిణామాలు తిరుమలలో తీవ్ర కలకలానికి దారి తీశాయి. అర్చక కుటుంబాల్లో ఆందోళనలను నింపాయి. కొద్దిరోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శనాలను నిలిపివేయాలనే డిమాండ్ కూడా వినిపించింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దగా స్పందించలేదు. భక్తుల దర్శనాలను యధాతథంగా కొనసాగిస్తూనే వస్తోంది.
 
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన పూజారి రమణ దీక్షితులు టీటీడీపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఆలయ పూజారుల రక్షణ విషయంలో టీటీడీ విఫలమైందని ఆరోపించారు. ఇటీవల కన్నుమూసిన అర్చకులకు ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థించారు. 
 
సీనియర్ ప్రధాన అర్చకులు పదవీ విరమణ తరవాత వంశపారంపర్య సేవలను పునరుద్ధరించాలని పోరాడుతూ మరణించారని తెలిపారు. మరో 45 సంవత్సరాల జూనియర్ అర్చకులు స్వామివారికి సేవలందిస్తూ మరణించారన్నారు. వారిని కాపాడటంలో టీటీడీ విఫలమయ్యిందని పేర్కొన్నారు. తన ట్వీట్‌ను ముఖ్యమంత్రి జగన్‌కు ఇంకా టీటీడీ ఛైర్మెన్ వైవి సుబ్బారెడ్డి‌కి ట్యాగ్ చేసారు.
  
ఈ ట్వీట్‌లో కరోనా వైరస్ బారిన పడి కన్నుమూసిన అర్చకుల కుటుంబాలను ఆదుకోవాలని రమణ దీక్షితులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కుటుంబ పెద్దను కోల్పోవడం వల్ల ఆయా అర్చక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. 
 
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చిందని చెప్పారు. సీనియర్ ప్రధాన అర్చకుడిని టీటీడీ పాలక మండలి తొలగించిందని, అనంతరం ఆయన వంశపారంపర్యాన్ని కొనసాగింపజేయడానికి పోరాడారని గుర్తు చేశారు.
 
45 సంవత్సరాల జూనియర్ అర్చకుడు శ్రీవారి సేవలో ఉంటూ, విధి నిర్వహణలో కరోనా వైరస్ బారిన పడ్డారని రమణ దీక్షితులు అన్నారు. కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారని చెప్పారు. 
 
అర్చకులను ఆదుకోవడంలో, అర్చక కుటుంబాలకు రక్షణ కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు విఫలం అయ్యారని విమర్శించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రమణ దీక్షితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఙప్తి చేశారు.