గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (12:35 IST)

తిరుపతి బీజేపీ అభ్యర్ధిగా రత్నప్రభ?, ఆమె రేసులోకి ఎలా వచ్చారు?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ పేరు దాదాపు ఖరారయింది. నేడో, రేపో ఆమె పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. పదవీ విరమణ చేసిన తర్వాత బీజేపీలో చేరిన ఆమెకు, కర్నాటక స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు.

ప్రధాని మోదీ సూచన మేరకే ఆమెకు ఆ పదవి ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కరోనా సీజన్‌కు ముందు ఆమె ప్రధానితో భేటీ అయిన తర్వాతనే, రత్నప్రభకు ఆ పదవి వచ్చినట్లు సమాచారం.
 
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్ధుల పేర్లపై బీజేపీ నాయకత్వం,  వైసీపీ-టీడీపీ కంటే ముందుగానే చాలా కసరత్తు చేసింది. మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు, ముని సుబ్రమణ్యం, వేండ్రాతి భాస్కరరావుతోపాటు త్రిపుర క్యాడర్‌కు చెందిన ఓ ఐఏఎస్, కర్నాక మాజీ డీజీపీ సహా పేర్లు పరిశీలించింది.

ఆ మేరకు సీటు ఆశిస్తున్న వారితో,  బీజేపీ రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్ దియోథర్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఆశావహుల ఆర్ధిక స్తోమత, బలం-బలహీనతలపై వారితో చర్చించారు. అయితే, రత్నప్రభ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
 
నిజానికి మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పేరుపై బాగా ప్రచారం జరిగింది. ఆయన కూడా తిరుపతిలోనే ఎక్కువకాలం మకాం వేశారు. ప్రతిష్టాత్మక సమరసతా సేవా  ఫౌండేషన్‌లో పనిచేస్తున్న ఆయన, తెలుగు రాష్ట్రాల్లోని హరిజన-గిరిజన వాడల్లో ఆలయాలు నిర్మించే కార్యక్రమం చేపట్టారు. ఆ పనులన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. సంఘ్ ఆ మేరకు ఆయనకు ఆ బాధ్యత అప్పగించింది.

పరిశీలనలో ఎక్కువమంది మాల వర్గానికి చెందిన వారే ఉండటంతో, మాదిగ వర్గానికి చెందిన వారి పేర్లు కూడా పరిశీలించాలని నిర్ణయించడంతో రత్నప్రభ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. నిజానికి ఇటీవల రాష్ట్ర నాయకత్వం వేసిన ఎన్నికల కమిటీలో దాసరి శ్రీనివాసులు పేరు చేర్చటం ద్వారా, ఆయనను వ్యూహాత్మకంగా తప్పించినట్టయింది.
 
వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి ఇద్దరూ మాల వర్గానికి చెందిన వారే. ఆ  సామాజిక సమీకరణల నేపథ్యంలో, మాదిగ వర్గానికి టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.