గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 12 నవంబరు 2021 (12:21 IST)

16న రాయలసీమ సాగునీటి సాధన సమితి స‌త్యాగ్ర‌హం

శ్రీబాగ్ ఒడంబడిక అమలుకోసం నవంబరు 16 న జరుగనున్న రాయలసీమ సత్యాగ్రహ దీక్ష ను విజయవంతం చేయాల‌ని రాయలసీమ సాగునీటి సాధన సమితి పిల‌పునిచ్చింది. రాయలసీమ పట్ల పాలకుల వివక్షతో అమరావతి రైతుల కంటే తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ‌ రైతాంగానికి  రాజకీయ పార్టీలు  బాసటగా నిలబడాలని సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విజప్తి చేసారు. 
 
 
రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శ్రీబాగ్ ఒప్పందం జరిగింద‌ని, కాని ఈ ఒప్పందం అమలులో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహించార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒప్పందం అమలు జరగడంపోవడం వలన రాయలసీమకు జరిగిన నష్టాన్ని సరిచేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం - 2014 అనేక అవకాశాలు కల్పించింద‌న్నారు. ఈ  అవకాశాలను సద్వినియోగం చేసుకొని, రాయలసీమ అభివృద్ధికి పాటు పడాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేసారు. 

 
పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందంలోని ప్రధాన అంశాలలో కృష్ణా, తుంగభద్ర, పెన్నా జలాల వినియోగంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలని డిమాండు చేశారు. రాజధాని, హైకోర్టులలో రాయలసీమ వారు ఏది కోరితే దానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలనీ, కోస్తా ప్రాంతంతో సమానంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాలలో శాసనసభ స్థానాల ఏర్పాటు, రాయలసీమలో విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నార‌ని తెలిపారు. కానీ పాలకులు కోస్తా ప్రాంతానికి కొమ్ము కాసి, రాయలసీమను నిర్లక్ష్యం చేసి "శ్రీబాగ్ ఒప్పందంను" తుంగలో తొక్కారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.

 
కరువుసీమను ఆదుకోవడానికి  సిద్దేశ్వరం వద్ద క్రిష్ణా పెన్నార్ ప్రాజెక్టుకు 1951 లోనే ప్లానింగ్ కమిషన్ అనుమతిస్తే, దానిని కూడా విస్మరించి నాగార్జునసాగర్ నిర్మాణం చేపట్టి రాయలసీమ ప్రజలకు తాగునీరు లభించకుండా చేసారని ఆయన తెలిపారు. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే, విశాల ఆంధ్రప్రదేశ్ పేరుతో హైదరాబాదును రాజధానిగా మార్చి రాయలసీమకు తీవ్ర అన్యాయం  చేసారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేపట్టిన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం - 2014 శ్రీబాగ్ ఒడంబడిక ను అమలు చేసే అవకాశాన్ని సద్వినియోగం చేయడంలో పాలకులు విపలమయ్యారని  విమర్శించారు.  

 
గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టకుండా అమరావతి కేంద్రంగా రాజధాని, హైకోర్టు, రాష్ట్ర స్థాయి కార్యాలయాల ఏర్పాటుతో రాయలసీమకు తీరని ద్రోహం చేసారు అని ఆన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును నెత్తిన ఎత్తుకొని రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన  రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణం పట్ల నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.
 

ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, పాలకులపై ఒత్తిడి పెంచడానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి మరియు రాయలసీమ లోని అనేక ప్రజా సంఘాలు గత కొన్ని సంవత్సరాలుగా శ్రీబాగ్ ఒప్పంద అమలు కోసం అనేక ఉద్యమాలు చేపట్టాయని ఆయన అన్నారు.

 
రాయలసీమ ప్రజా సంఘాల ఉద్యమాల ఫలితంగా నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీబాగ్ ఒప్పందంను గౌరవిస్తున్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ చేపడతామని ప్రకటించారు. కాని చేతలలో పాలకులు విపలమయ్యారని విమర్శించారు. శ్రీబాగ్ ఒప్పందంను గౌరవించి న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేస్తామన్న పాలకులు న్యాయ రాజధానిలో భాగమైన "కృష్ణా నది యాజమాన్య బోర్డు" ను  విశాఖపట్నం లో ఏర్పాటుకై  కేంద్రానికి ప్రతిపాధనలు పంపారని విమర్శించారు. 
 

తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు - నగరి,  వెలిగొండ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం - 2014 లో  చట్టబద్దంగా అనుమతించారు. కాని కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో ఈ ప్రాజక్టులను అనుమతిలేని ప్రాజెక్టులగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులు గా కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో సవరణలు చేయాలని కోరడంలో కూడా పాలకులు విఫలమయ్యారు అని విమర్శించారు. 
 

శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర భూభాగాలతోనే కొనసాగుతున్న నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న నిర్వహించాల‌ని డిమాండు చేశారు. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు - నగరి,  ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర,  వెలిగొండ ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో సవరణలు చేసిన తరువాతనే ఈ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించాల‌న్నారు.
 

పాలనా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా  హైకోర్టు తో పాటు, సెక్రెటరియేట్ లో కొన్ని విభాగాలు, అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, కార్పొరేషన్ లు రాయలసీమలో ఏర్పాటు చేయాల‌ని డిమాండు చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ లో 80 వేల ఎకరాలు త్యాగం చేసిన నందికోట్కూరు ప్రాంతంలోని పల్లెలకు తాగు, ఆరు తడి పైర్లకు నీరందించాడానికి ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలకు నీరందడానికి శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం 854 అడుగులు కొనసాగించాల‌ని కోరారు.  సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కార్యాచరణ చేపట్టాల‌ని, గుండ్రేవుల రిజర్వాయర్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాల‌ని డిమాండు చేశారు.