శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (14:53 IST)

చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్ర చందనం స్వాధీనం... 12 మంది అరెస్టు

Red sandalwood
చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను ఆ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనందుంగల విలువ రూ.11 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఈ దుంగలను తరలిస్తున్నందుకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్ బాగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున ఎర్ర చందనం పట్టుబడుతుంది. 
 
మంగళవారం చిత్తూరు నుంచి తమిళనాడుకు తరలిపోతున్న రూ.3 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తమిళనాడుకు చెందిన గోవిందస్వామి, మురుగేశన్, పెరుమాళ్ వెంకటేష్, కరియ రామన్, కలంజన్, వెంకటేష్ ఆర్. గోవిందరాజులు అనే వారిని అరెస్టు చేశారు. 
 
మరో ఘటనలో తిరుపతి నుంచి చిత్తూరుకు వెళుతున్న ఒక మినీ వ్యానును తనిఖీ చేయగా, అందులో రూ.4 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దేవన్ అలియాస్ నాగరాజ్, వైద్యలింగం, నజీర్ బాషా, ముత్తురామన్‌ అనే వారిని అరెస్టు చేశారు. ఈ స్మగ్లింగ్‌కు సూత్రధారిగా భావిస్తున్న సెంథిల్ కుమార్ అనే బడా స్మగ్లర్ పరారీలో ఉన్నాడు.