శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (15:21 IST)

తెలంగాణ సీఎం... రేపు రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చోవచ్చు : గులాం నబీ ఆజాద్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావొచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసినందుకు సీఎం కేసీఆర్ రేవంత్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
తెలంగాణ రాష్ట్ర పోలీసులు రేవంత్ రెడ్డిని మంగళవారం అర్థరాత్రి అరెస్టు చేసి, సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్, అక్కడ నుంచి కొడంగల్‌కు వచ్చిన గులాం నబీ ఆజాద్... రేవంత్‌ను పరామర్శించారు. ఈ సందర్భగా ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ, అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదన్నారు. 
 
అధికారంలో ఉన్నామని కళ్లు నెత్తికి ఎక్కకూడదని, కాళ్లు నేలపైనే ఉండాలని కోరారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలులో పెట్టి కొడంగల్ రావడం ప్రజాస్వామ్యమా? అని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే రేవంత్‌ను విడుదల చేసి కొడంగల్‌కు రావాలని సవాల్ విసిరారు. అధికారం ఎన్నది ఎన్నటికీ శాశ్వతం కాదనీ, ఈ రోజు సీఎం కుర్చీపై కేసీఆర్ ఉన్నారనీ.. రేపు అదే కుర్చీపై రేవంత్ రెడ్డి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
 
రేవంత్ సీఎం అవ్వొచ్చు అని ఆజాద్ చెప్పగానే కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. కాగా, ఆజాద్ వ్యాఖ్యలతో టీకాంగ్రెస్‌లో కలకలం చెలరేగింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సహా పలువురు నేతలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కలిసి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.