శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (11:00 IST)

తెలంగాణలో డబ్బే డబ్బు.. కట్టలు కట్టలుగా పెట్టెల్లో పెట్టి..?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో ధనం ప్రవాహంగా మారింది. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో రెండు కార్లలో రూ.2.14 కోట్లు కనిపించాయి. ఈ డబ్బుకు సరైన పత్రాలను చూపించడంలో వాహనదారులు విఫలం కావడంతో.. ఆ డబ్బును సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. 
 
ఈ డబ్బును టీఆర్ఎస్‌కు చెందిన నేత వేర్వేరు కార్లలో మెదక్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే షాద్ నగర్‌లో ఓటర్లకు ప్రలోభపెట్టేందుకు భారీగా డబ్బు పంచుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు చేసిన మెరుపుదాడిలో రూ.30లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. 
 
ఇంకా తెలంగాణ ఎన్నికల్లో భాగంగా అక్రమ నగదుకు చెక్ చెప్పేందుకు జరుపుతున్న తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకూ రూ. 111 కోట్లను సీజ్ చేశామని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ చెప్పారు. ఈ డబ్బులో రూ. 94.17 కోట్లు పోలీసులకు పట్టుబడగా, మిగతా డబ్బును ఐటీ అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారని చెప్పారు.
 
అంతేగాకుండా.. రూ. 9.62 కోట్ల విలువైన మద్యం, రూ. 7.77 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను కూడా సీజ్ చేశామని రజత్ కుమార్ తెలిపారు. గతఎన్నికల కంటే అదనంగా రూ. 28 కోట్లు లభించాయని, ఈ రెండు రోజులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తామన్నారు.