శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:32 IST)

గుడ్లగూబలను చంపేస్తున్న ఎన్నికల అభ్యర్థులు... ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే...

గ్లోబెల్ వార్మింగ్, రేడియేషన్, వాతావరణం, నీటి కాలుష్యం వంటి కారణంగా భూమండలంపై మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పక్షిజాతులు అయితే అనేకం చనిపోతున్నాయి. దీంతో పక్షిజాతి మనుగడే ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు ఓ పక్షిజాతిపై పగపట్టినట్లుగా వుంది. అదే గుడ్లగూబ. రాత్రివేళ్లలో మాత్రమే సంచరించే ఈ గుడ్లగూబలపై తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల కళ్లు పడ్డాయి. దీంతో వాటిని పట్టి తెచ్చి చంపి పడేస్తున్నారు. ఎందుకు? అంటే గెలుపు కోసమట. అభ్యర్థుల గెలుపుకు, గుడ్లగూబలకు సంబంధం ఏమిటా? అనుకుంటున్నారా? అయితే, ఈ కథనం చదవండి. 
 
ఈ గుడ్లగూబలు ఇప్పటికే చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అలాంటివాటికి తెలంగాణ ఎన్నికల రూపంలో మరో ఉపద్రవం వచ్చిపడింది. గుడ్లగూబలను చంపి వాటిని ప్రత్యర్థుల నివాస స్థలాల్లో పడేస్తే ఇక తమ గెలుపును ఖాయమనే మూఢనమ్మకంతో గుడ్లగూబలను ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి మరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొనుగోలు చేస్తున్నారు. 
 
దీంతో ఒక్కసారిగా గుడ్లగూబలకు మస్తు గిరాకీ పెరిగింది. ఒక్కో గుడ్లగూబకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వెచ్చించేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. దీంతో గుడ్లగూబలకు ఏ మేరకు డిమాండ్ పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు దళారులు కూడా ఏర్పడ్డారు. కొందరు గుడ్లగూబల వేటకు బయలుదేరారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో గుడ్లగూబల కోసం వేట జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం సేడంలో ఆరుగురు వ్యక్తులు గుడ్లగూబలను విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అంటే ఇది ఎంతటి తీవ్రస్థాయికి చేరుకుందో ఊహించుకోవచ్చు. 
 
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వీటిని విక్రయిస్తున్నట్టు విచారణలో వారు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఒక్కో గుడ్లగూబకు డిమాండ్‌ను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు విక్రయిస్తున్నట్టు వారు తెలిపారు. అంతేకాదట వీటిలో మేలు జాతి గుడ్లగూబలకే ఇంకా మంచి గిరాకీ వుందని వారు చెప్పటం విశేషం. ఈ విషయం తెలిసిన పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లగూబలను వేటాడేవారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.