సీఎం కుర్చీపై రేపు రేవంత్ రెడ్డి కూర్చోవచ్చు.. ఆజాద్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సహా పలువురు నేతలున్న సంగతి తెలిసిందే. ఇంకా తెలంగాణలో ప్రజా కూటమి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ.. రేవంత్ విడుదలైన అనంతరం ఆయనను కొడంగల్‌లో పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు సీఎం కుర్చీపై కేసీఆర్ ఉన్నారని, రేపు అదే కుర్చీపై రేవంత్ రెడ్డి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి జైలులో పెట్టి కొడంగల్ రావడం ప్రజాస్వామ్యమా అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే రేవంత్ రెడ్డిని విడుదల చేసి కొడంగల్ రావాలని సవాల్ విసిరారు. అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదన్నారు. కాగా రేవంత్ రెడ్డి సీఎం కావొచ్చునని చెప్పగానే కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం చప్పట్లతో మారుమోగింది. కాగా ఆజాద్ వ్యాఖ్యలతో టీకాంగ్రెస్‌లో కలకలం రేగింది.