RK Roja: కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు ఇచ్చారు.. రోజా ఫైర్
ఏపీలోని సంకీర్ణ ప్రభుత్వంపై వైకాపా ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎ చంద్రబాబు నాయుడుతో పాటు హోంమంత్రి అనిత, సవితపై ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని వైసిపి నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. పేదలకు మెరగైన వైద్యం అందించాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేశారని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు.
వైఎస్‌ఆర్ సిపి హయాంలో శరవేగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగాయని, మెడికల్ కాలేజీలలో మిగిలిన నిర్మాణ పనులు ప్రభుత్వమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తయారు చేసిన ఫేక్ వీడియోలను హోంమంత్రి అనిత మీడియాకు చూపించారని దుయ్యబట్టారు.
పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనంతపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్పత్రిని నిర్మించారన్నారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు చంద్రబాబు ఇస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.