సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 13 నవంబరు 2021 (23:10 IST)

కుప్పం మునిసిపల్ ఎన్నికలు: చంద్రబాబు, లోకేష్ మీద ఘాటు విమర్శలు చేసిన రోజా

కుప్పంలో ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల మీద నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా ఉందని ఆమె విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలు పెడితే తెలుగుదేశం పార్టీని ప్రజలు తుంగలో తొక్కారని, మున్సిపల్ ఎన్నికల్లో మురికి కాలువలో ముంచెత్తారు అని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టారని ఆ దెబ్బకి భయపడి ఎన్నికలకి దూరంగా ఉన్నామని ప్రకటించుకోవాల్సి వచ్చిందన్నారు. 
 
మొన్న బద్వేలు జరిగిన ఉపఎన్నికల్లో బిజెపికి ఏజెంట్‌గా పని చేసి ఓట్లు వేయించుకోవాలన్న టీడీపి కుతంత్రాలకి డిపాజిట్ గల్లంతు అయిందని రోజా వ్యాఖ్యానించారు. అలాగే తిరుపతి ఎన్నికల్లో కూడా బుధ్ధి చెప్పినా ఇంకా బుధ్ధి రాని చంద్రబాబు నాయుడు, లోకేష్ దమ్ముంటే రండి అని మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగానే హాస్యాస్పదంగా ఉందన్నారు.. 

 
అందులోనూ లోకేష్ మాట్లాడే మాటలు చూస్తుంటే తనకు నిజంగానే అనుమానంగా ఉందని, ఎందుకంటే కుప్పం మున్సిపల్ ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదని, కుప్పానికి ఏం అభివృద్ధి చేశాడని, నీళ్లు ఎందుకు తేలేదని మంగళగిరిలో తనను ఓడించిన నాన్న మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి వాళ్ల నాన్న రాజకీయ భవిష్యత్తుని సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనిపిస్తుందని రోజా ఎద్దేవా చేశారు.

 
కుప్పం ప్రజల సుఖదుఃఖాల్లో పాలు పంచుకోవడానికి లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని, భువనేశ్వరీ గాని కుప్పంలో ఒక ఇల్లు నిర్మించుకోవడం లేక కార్యాలయం ఏర్పాటు చేసుకుని వారికి అందుబాటులో ఉండి వారి సుఖదుఃఖాలలో పాలుపంచుకున్న దాఖలాలు లేవన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు, అతనిని ఓట్లు వేయించి గెలిపించుకున్న కుప్పం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా గాలికి వదిలేస్తే, జగన్మోహన్ రెడ్డి మాత్రమే వారిని తమ సొంత నియోజకవర్గ ప్రజలు లాగా చొరవ తీసుకుని ప్రతి అభివృద్ధి పనులు కుప్పంని భాగస్వామ్యం చేసి తమకు ఓట్లు వేసినా, వేయకపోయినా కులమతాలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి అందేటట్లు చూసుకున్నారన్నారు.

 
అందుకు రుణంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి చంద్రబాబు అనే తుప్పుకి లోకేష్ అనే పప్పుకి గుణపాఠం నేర్పిస్తున్నారు అని రోజా జోస్యం చెప్పారు. ఈ రాష్ట్రంలో క్యాంపు రాజకీయాలకి, డబ్బులతో ప్రలోభ పెట్టే రాజకీయాలకి, మద్యంతో ప్రలోభపెట్టే రాజకీయాలకి తెర లేపింది చంద్రబాబు నాయుడేనన్నారు.

 
ఆ విషయం కుప్పం ప్రజలతో సహా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసునని, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనీ కచ్చితంగా గెలిపించి లోకేష్‌కి, చంద్రబాబుకి రాసుకోవడానికి చరిత్ర గాని, చూసుకోవడానికి భవిష్యత్తు గాని లేకుండా చేస్తారని రోజా అన్నారు.