వామ్మో, రూ. 2000 కోట్ల హెరాయిన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు...
బెజవాడ కేంద్రంగా అతి పెద్ద హెరాయిన్ రాకెట్ గుట్టు రట్టయింది. టాల్కం పౌడర్ పేరుతో ఈ హెరాయిన్ ను ఆఫ్గాన్ నుంచి రవాణా చేస్తుండటం మరో సంచలనం. 2 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ అఫ్ఘానిస్థాన్ నుంచి విజయవాడకు టాల్కం పౌడర్ (ముఖానికి రాసుకునే పౌడర్) పేరిట కంటైనర్‌లలో అక్రమంగా రవాణా అవుతుండగా, గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో ఉన్న ముంద్రా పోర్టులో డీఆర్‌ఐ ( డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు.
అఫ్ఘానిస్థాన్‌లోని కాందహార్‌కు చెందిన హసన్ హుస్సేన్ లిమిటెడ్ అనే సంస్థ వీటిని పంపినట్టు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్ ఫర్మ్ అనే సంస్థ వీటిని బుక్ చేసుకుంది. కన్‌సైన్‌మెంట్‌లో పేర్కొన్న అడ్రస్ మేరకు విజయవాడలోని సత్యనారాయణపురం వెళ్లిన అధికారులకు అక్కడ ఓ డాబా ఇల్లు మాత్రమే కనిపించడం విశేషం. దీనిపై డీఆర్‌ఐ, కస్టమ్స్ అధికారులు గత ఐదు రోజులుగా దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్ రాకెట్‌తో విజయవాడకు లింకులున్నాయా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇరాన్‌కు చెందిన రెండు నౌకల్లో భారత్‌కు వస్తున్న 2,988 కిలోల హెరాయిన్‌ను నిఘా పెట్టి గుజరాత్‌లో పట్టుకున్నారు. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి బందరు పోర్టుకు దిగుమతి చేసుకొంటున్నట్లు తేలింది. 988 కిలోల చొప్పున కంటైనర్లలో వాటిని ముంబైకి చేర్చేలా దిగుమతిదారులు బుక్ చేసినట్లు గుర్తించారు. కంటైనర్లలో ఉన్న పౌడర్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలించి హెరాయిన్ అని తేలాక ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు అఫ్ఘాన్ జాతీయులు ఉన్నారు.
విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న ఆశి ట్రేడింగ్ కంపెనీలో అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. గోవింద రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు అతిపెద్ద డ్రగ్ రాకెట్‌లో బెజవాడ ఏజెన్సీ, ఇక్కడి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఏపీ పోలీసులు ఉలిక్కి పడ్డారు. అంత పెద్ద మొత్తంలో తీసుకొస్తున్న డ్రగ్‌ను ఇతరత్రా ఏ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.? ఎవరైనా పెద్దల పాత్ర ఉందా? గుట్కా మాఫియా పాత్ర ఉండొచ్చా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే నార్కోటిక్ బ్యూరో ఇప్పటికే రంగంలోకి దిగిందని, ఎన్‌ఐఏ, సీబీఐ, సీవీసీ సంస్థలు కూడా కూపీ లాగుతున్నాయని అత్యంత విశ్వసనీయ సమాచారం.
సోలార్ ప్లేట్ల ఏర్పాటు పనుల పేరిట విజయవాడ సత్యనారాయణపురంలో ఆశి ట్రేడింగ్ కంపెనీని మాచవరం సుధాకర్ అనే వ్యక్తి ప్రారంభించినట్టు తెలిసింది. కంపెనీని ఇక్కడ ఏర్పాటు జరిగినప్పటికీ కార్యకలాపాలు చెన్నై కేంద్రంగా నడుస్తున్నాయని సమాచారం.