శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:16 IST)

తాలిబాన్: అఫ్గానిస్తాన్‌లో కో-ఎడ్యుకేషన్ రద్దు, విద్యార్థినులకు హిజాబ్ తప్పనిసరి

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ అధికారికంగా జెండా ఎగురవేసిన మరుసటి రోజే తమ ఉన్నత విద్యా విధానాన్ని ప్రకటించింది. యూనివర్సిటీల్లో జెండర్ పరంగా వేర్వేరు తరగతులు నిర్వహిస్తారని, కొత్త డ్రెస్ కోడ్ కూడా ప్రవేశపెట్టనున్నామని తాలిబాన్ తెలిపింది. మహిళలు చదువుకునేందుకు అనుమతి ఉందిగానీ పురుషులతో కలిసి కాదని చెప్తూ, కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తున్నట్లు అఫ్గానిస్తాన్‌కు కొత్తగా ఎన్నికైన ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటించారు.

 
అలాగే, విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలను పునఃసమీక్షించనున్నట్లు వెల్లడించారు. గతంలో, 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ అధికారంలో ఉన్నప్పుడు బాలికల, మహిళల విద్యపై నిషేధం ఉండేది. కానీ, ఇప్పుడు అలా ఉండదని, మహిళలు చదువుకోకుండా, ఉద్యోగాలు చేయకుండా తాము అడ్డుకోబోమని తాలిబాన్ తెలిపింది.

 
అయితే, ఆగస్టు 15న కాబుల్‌ను ఆక్రమించుకున్నప్పటి నుంచీ, ప్రజారోగ్య రంగంలో ఉన్న మహిళలు తప్ప మిగతావారంతా ఆఫీసులకు రాకూడదని, భద్రతా పరిస్థితి మెరుగుపడేవరకు ఇంటిపట్టునే ఉండాలని తాలిబాన్ ఆదేశించింది. తాలిబాన్ పాలనకు సంకేతంగా అఫ్గాన్ అధ్యక్ష భవనంపై జెండా ఎగురవేసిన మరుసటి రోజు, ఆదివారం అఫ్గాన్ ఉన్నత విద్యా విధానానికి సంబంధించి భారీగా మార్పులను ప్రకటించారు.

 
కో ఎడ్యుకేషన్ రద్దు
తాలిబాన్‌లు అధికారంలోకి రావడానికి ముందు అఫ్గానిస్తాన్‌లో కో ఎడ్యుకేషన్ ఉండేది. మహిళా విద్యార్థులకు డ్రెస్ కోడ్ ఉండేది కాదు. "కో ఎడ్యుకేషన్ విధానాన్ని రద్దు చేయడంలో మాకెలాంటి పునరాలోచన లేదు. ప్రజలంతా ముస్లింలే, దీన్ని వారు తప్పక ఆమోదిస్తారు" అని హక్కానీ అన్నారు. కాగా, అమ్మాయిలకు, అబ్బాయిలకు విడివిడిగా తరగతులు నిర్వహించేందుకు యూనివర్సిటీల్లో తగినన్ని వనరులు లేవని, ఈ కొత్త నియమాల వలన మహిళలు చదువుకు దూరం అయిపోతారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 
"అదంతా యూనివర్సిటీ సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. పరదా వెనకాల నిల్చుని బోధించేందుకు పురుష ఉపాధ్యాయులకు అనుమతి ఇవ్వొచ్చు. లేదా టెక్నాలజీ ఉపయోగించి బోధన కొనసాగించవచ్చు" అని హక్కానీ అన్నారు. యూనివర్సిటీల్లోనే కాకుండా, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో కూడా కో ఎడ్యుకేషన్‌పై రద్దు కొనసాగుతుంది. ఇది గతంలో కూడా అఫ్గానిస్తాన్‌లో అమలులో ఉన్న విధానమే.

 
మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాల్సి ఉంటుందని హక్కానీ తెలిపారు. అయితే, అదనంగా ముఖానికి ముసుగు ధరించాలా, లేదా అనేది స్పష్టం చేయలేదు. యూనివర్సిటీల్లో విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలను కూడా సమీక్షించనున్నట్లు హక్కానీ తెలిపారు. "ఇస్లామిక్ విలువలకు, జాతీయ, చారిత్రక విలువలకు అనుగుణంగానూ, మరోవైపు ఇతర దేశాల విద్యార్థులతో పోటీకి అనుగుణంగానూ ఉండేలా పాఠ్య ప్రణాళిక రూపొందించడమే తాలిబాన్ లక్ష్యం" అని ఆయన అన్నారు.

 
కాబూల్‌లోని షహీద్ రబ్బానీ ఎడ్యుకేషన్ యూనివర్శిటీలో తాలిబాన్ల జెండర్ విధానాలకు మద్దతు ఇస్తూ కొందరు మహిళలు చేసిన ప్రదర్శన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. నల్లటి నిఖాబ్‌లు ధరించి, తాలిబాన్ జెండాలు పట్టుకుని వందలమంది మహిళలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. అఫ్గానిస్తాన్‌లో కొత్త పాలనను ప్రశంసిస్తూ, దేశంలో మహిళల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నవారిని దుయ్యబడుతూ ప్రసంగాలు చేశారు.

 
గత ఇరవై ఏళ్లల్లో విద్యా రంగంలో ఉన్నతి
2001లో తాలిబాన్ పాలన ముగిసిన తర్వాత, గత ఇరవై ఏళ్లల్లో అఫ్గానిస్తాన్ విద్యా విధానం ఎంతో మెరుగుపడింది. ముఖ్యంగా మహిళల విద్య, ఉపాధి విషయాల్లో ఎంతో ఉన్నతి సాధించింది. స్కూలుకు, యూనివర్సిటీలకు వెళ్లి చదువుకునే బాలికల, మహిళల సంఖ్య, అక్షరాస్యత రేట్లు గణనీయంగా పెరిగాయి.

 
గత 17 ఏళ్లల్లో ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య దాదాపు సున్నా నుంచి 25 లక్షలకు పెరిగిందని ఇటీవల యునెస్కో ప్రచురించిన ఒక రిపోర్ట్ తెలిపింది. అలాగే, ఒక దశాబ్ద కాలంలో మహిళల అక్షరాస్యత రేటు దాదాపు రెట్టింపు అయి, 30 శాతానికి చేరుకుందని ఈ నివేదిక పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను, ధర్మాధర్మ (వైస్ అండ్ వర్ట్యూ) మంత్రిత్వ శాఖతో భర్తీ చేసింది.

 
గతంలో తాలిబాన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విభాగం ఉండేది. షరియా చట్టాన్ని దేశమంతటా అమలు జరిగేలా చూడడమే ఈ శాఖ పని. అందుకు మత రక్షక సేనలను వీధుల్లో మోహరించేవారు. సరైన దుస్తులు ధరించలేదని, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వచ్చారని మహిళలను హింసించేవారు. తాలిబాన్ అధికారంలోకి వస్తుందనే భయంతో ఇప్పటికే అనేకమంది ప్రముఖ మహిళా వృత్తినిపుణులు దేశం విడిచి పారిపోయారు. అఫ్గాన్‌లో ప్రముఖ పాప్ సింగర్ ఆర్యానా సయీద్ దేశం విడిచి అమెరికా కార్గో విమానంలో పారిపోయారు. అలాగే, ప్రముఖ సినిమా దర్శకురాలు సహ్రా కరీమీ ఉక్రెయిన్ వెళిపోయారు.