శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 25 అక్టోబరు 2021 (15:11 IST)

కోసూరిపాలెంలో ఇసుక దందా... వైసీపీ నేత‌ల కొట్లాట‌

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరువారి పాలెంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా గ్రామంలో రెండు వర్గాల నడుమ ఆధిపత్య పోరుకు దారి తీసింది. కోసూరువారిపాలెం గ్రామానికి చెందిన కొందరు వైసిపి నేతలు గ్రామ సమీపంలోని కృష్ణానది పాయ నుండి ఇసుకను అక్రమంగా ఎడ్లబండ్లతో తరలిస్తూ గ్రామస్తులకు విక్రయిస్తున్నారు. ఈ ధరతో కొనలేని కొందరు గ్రామస్తులు సమీప గ్రామాల నుండి ఎడ్లబండ్లను పిలిపించుకుని కూలి రేట్లకే కావాల్సిన ఇసుకను తోలుకుంటున్నారు. 
 
దీనితో ఆగ్రహించిన గ్రామానికి చెందిన వైసీపీ నేతలు బయటి గ్రామం నుండి వచ్చిన ఇసుక బండ్లను అడ్డగించారు. బండి ఒక్కంటికి 350 రూపాయలకు ఇసుక తోలితే తమకు నష్టం ఏర్పడుతుందని బయట గ్రామాల వారు తోలడానికి వీల్లేదని అడ్డగించారు. తక్కువ ధరకు ఇసుక తరలించుకుంటుంటే అడ్డగించడానికి మీరవరంటూ వైసిపి నేతలపై గ్రామ‌స్తులు తిరగబడ్డారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇసుక తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇసుక తోలే ప్రదేశం సి.ఆర్.జెడ్ పరిధిలో ఉన్నప్పటికీ రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ అధికారులు ఎడ్లబండ్లతో ఇసుక తోలుకునేందుకు ఎలా అనుమతిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందని గ్రామానికి చెందిన పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ విషయమై మోపిదేవి తహసీల్దార్ మస్తాన్ ను ప్ర‌శ్నించగా, ఆయ‌న స్పందిస్తూ స్థానిక ఇళ్ల నిర్మాణ అవసరాలకు మినహాయించి ఎవరైనా వ్యాపారానికి ఇసుక వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.  సమీప గ్రామాల ప్రజలు ఎవరైనా సచివాలయం నుంచి అనుమతి తీసుకొని ఇసుక ఉచితంగా తీసుకోవచ్చని తెలిపారు.