1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (13:26 IST)

ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష చేస్తున్నారు. 
 
పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు, పోలీస్ శాఖను ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
 
దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్.. పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. 
 
ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు, ఐజీలు, డీఐజీలు, అడీషినల్ డీజీ లా అండ్ ఆర్డర్, ఇంటలిజెన్స్ అడీషినల్ డీజీ, జిల్లాల ఎస్పీలు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్లు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు.