1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (14:42 IST)

సాంప్ర‌దాయ నృత్యం విలువ‌కు వెండితెర రూప‌మే నాట్యం- రివ్యూ రిపోర్ట్‌

Natyam poster
కూడిపూడి నృత్య‌కారిణి సంధ్యారాజు నిర్మిస్తూ న‌టించిన సినిమా `నాట్యం`. వెంప‌టి చిన స‌త్యం ఆమె గురువు. అక్క‌డ‌నుంచి త‌న‌కు తెలిసిన అనుభ‌వాల‌తో `నృత్యం` అనే షార్ట్ ఫిలిం తెర‌కెక్కించారు. ఆ త‌ర్వాత అది నెటిజ‌న్ల‌లో మంచి ఆద‌ర‌ణ పొంద‌డంతో అదే ద‌ర్శ‌కుడు రేవంత్ కోరుకొండ నేతృత్వంలో చేసిన ప్ర‌య‌త్న‌మే `నృత్యం` సినిమా.  ఈ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది. అదెలా వుందో చూద్దాం.
 
క‌థః
అది నాట్యం అనే గ్రామం. బ్రిటీష్‌వారి ఏలుబ‌డిలో అక్క‌డ సంప్ర‌దాయ నాట్యంతో ప్ర‌జ‌లంతా ఒక‌ట‌వుతార‌ని నిషేధిస్తూ నాట్య ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగే దేవాల‌యాన్ని మూసివేస్తుంది. అప్ప‌టికి కాదంబ‌రి గొప్ప న‌ర్త‌కి. ఆమె అక‌స్మాత్తుగా చ‌నిపోతుంది.  ఆమె ఆ నాట్యం గ్రామానికి చెందిన నాట్యాచారుడు ఆదిత్య మీనన్ భార్య. ఆ స‌మ‌యంలోనే చిన్న‌త‌నంలో సితార (సంధ్యారాజు) గురువు ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకుంటుంది. ఆమెకు కాదంబ‌రి నృత్య‌మంటే ఇష్టం. ఇక పెద్ద‌య్యాక ఆ గురువు నీడ‌లో నాట్య‌కారిణిగా పేరుతెచ్చుకుంటుంది. కానీ ఆమె అరంగేట్రానికి  గురువుగారు స‌మ‌యాన్ని ఇవ్వ‌రు. పైగా కాదంబ‌రి నృత్యం చేయ‌వ‌ద్ద‌ని సితార‌ను గ‌ట్టిగా మంద‌లిస్తాడు. అలా చేస్తే చ‌నిపోతార‌ని న‌మ్మ‌కం ఊరి జ‌నాల్లో వుంద‌ని తెలియ‌జేస్తాడు. ఆ న‌మ్మ‌కాల‌ను న‌మ్మ‌దు ఆమె. కానీ ఈ విష‌యాన్ని తెలుసుకున్న ఆ ఊరి దేవాలయ ధర్మకర్త (శుభలేఖ సుధాకర్) సితార చేసే నృత్య‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఓసారి తీవ్ర అంత‌రాయం కలిగిస్తాడు. దాంతో అమ్మ‌వారికి కోపం వ‌చ్చి ఇలా జ‌రిగింద‌ని భ‌క్తులు మూఢ‌న‌మ్మ‌కంతో సితాను ఊరినుంచి వెలేస్తారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? ఈ క్ర‌మంలో ఆమె ప్రేమ‌లో ఎవ‌రితో ప‌డింది? అనేది మిగిలిన క‌థ‌.
 
విశ్లేష‌ణః
నృత్యంలో దేశీయ సాంప్ర‌దాయంతో కూడిన క‌థ‌ల‌తో ప‌లు సినిమాలు వ‌చ్చాయి. ఆనంద‌భైర‌వి నుంచి స్వ‌ర్ణ‌క‌మ‌లం వ‌ర‌కు ప‌లు చిత్రాలు వ‌చ్చినా వాణిజ్యాంశాలు కూడా అందులో జోడించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈ `నృత్యం` సినిమాలో అటువంటి ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేదు. నృత్య‌నేప‌థ్య సినిమాల‌కు అదేపేరు పెట్ట‌డం సాహ‌సంతో కూడిన ప‌నే. అందుకే ఇది కేవ‌లం నాట్యం ఇష్ట‌ప‌డేవారికే అన్న‌ట్లుగా డైరెక్ట్‌గా తెలియ‌జేయ‌డంతో ప్రేక్ష‌కులుకూడా పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. టైటిల్ సినిమాకు ప్ర‌ధాన లోపం. చంద్ర‌ముఖి త‌ర‌హాలో కాదంబ‌రి అంటూ ఏదో పేరు పెట్టి జ‌నాల‌ను రాబ్టట్టుకునే ప్ర‌య‌త్నం చేసి వుంటే బాగుండేది.
 
పైగా సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదలచేసిన టీజర్, ట్రైలర్స్ లో నృత్యానికే ప్రాధాన్యమిచ్చారు. నిజానికి ఈ దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి ప్రాణ త్యాగం చేసిన ఓ నృత్యకారిణికి సంబంధించిన కథ ఇది. దాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించే ప‌నిలో ద్వితీయార్థంలో బాగా చూపించారు. ప‌తాక‌స‌న్నివేశం బ‌లంగా వుంది. అందుకు సంబంధించిన సిజి. వ‌ర్క్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. హంపి వంటి దేవాల‌య ప్రాంతాల్లో ఈ సినిమా తెర‌కెక్కించ‌డం బాగుంది. ఓ నాట్య‌కారిణికి బ్రిటీష్ అధికారికి మ‌ధ్య ప్రేమ‌క‌థ ఇందులో వుంది. దాన్ని విశ్వ‌నాథ్ వంటివారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆవిష్క‌రిస్తే ఈ సినిమా మ‌రింత ర‌క్తిక‌ట్టేది.
 
మొద‌టినుంచి చెబుతున్న‌ట్లు నాట్యం కూడా ఓ క‌థ లా చెప్పే ప్ర‌య‌త్నం అన్న ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు కూడా వారి చెప్పిన‌ట్లే చేశారు. కొన్ని ఇందులో హృద్యంగా చూపించారు. ఇలాంటి నృత్య ప్రధాన చిత్రాలు అన్ని వర్గాలను ఆకట్టుకోవన్నది వాస్తవం. ‘నాట్యం’ కూడా అదే కోవకు చెందే చిత్రం. కళలపట్ల ఆసక్తి ఉన్న వారికి, నృత్యం లో ప్రవేశం ఉన్నవారికి ఇది నచ్చినట్టుగా మిగిలిన వారికి నచ్చకపోవచ్చు. 
 
ముఖ్యంగా ఎంత నాట్య బేస్డ్ సినిమా అయినా ఊహించ‌ని మ‌లుపులు వుంటేనే ఈ సినిమా మ‌రింత ఆస‌క్తి క‌లిగించేది. కేవ‌లం త‌ను నాట్య‌కారిణిగా ప‌దిమందికి వెండితెర‌పై ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్న‌మే సంథ్యా రాజ్ చేసింది. కానీ  చూస్తున్నంత సేపు ఎక్కడా విసుగు మాత్రం పుట్టదు. దానికి ప్రధానకారణం సినిమాటోగ్రాఫర్ కమ్ ఎడిటర్ అయిన డైరెక్టర్ రేవంత్ కోరుకొండ పనితనం. అలానే శ్రవణ్‌ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం. ఇక మహేశ్ ఉప్పుటూరి ఆర్ట్ డైరెక్షన్, థండర్ స్టూడియోస్ వి.ఎఫ్.ఎక్స్. సినిమాను మరో స్థాయిలో నిల్చోపెట్టాయి. 
 
న‌టీన‌టులు
స్వ‌త‌మాగా నృత్య కళాకారిణి అయిన సంధ్యా రాజు సితార పాత్రలోఇమిడిపోయారు. ఇక కమల్ కామరాజ్ ఓ స్పెషల్ సర్ప్రైజ్. గతంలో వైవిధ్యమైన పాత్రలు అతను ఎన్ని చేసినా… సినిమా ప్రారంభంలో వచ్చే అర్థనారీశ్వర నృత్యంలో కొన్ని చోట్ల సంధ్యారాజును సైతం తన నృత్య భంగిమలతో ఆక‌ట్టుకున్నాడు. ఇక రోహిత్ బెహెల్ తెలుగువాడు కాకపోయినా పాత్రను అర్థం చేసుకుని చక్కని హావభావాలు పలికించాడు. అత‌న్ని ఆహార్యం అంతా హీరో నానిని గుర్తుచేస్తుంది. నానికి సోద‌రుడా! అన్నంత‌లా అత‌ను క‌నిపిస్తాడు.  హీరోయిన్ తల్లిదండ్రులుగా భానుప్రియ, అప్పాజీ అంబరీశ నటించారు. నృత్య కళాకారిణి రుక్మిణి విజయ్ కుమార్, సుప్రియ ఐసోలా అతిథులుగా న‌టించారు.
 
ఇలాంటి క‌థ‌ను మ‌రింత వాణిజ్యాంశాల‌తో తీస్తే ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి పేరు తెచ్చుకునేది. అందుకు ప్ర‌య‌త్నం చేయ‌లేద‌నే చెప్పాలి. అయితే సంప్రదాయ నృత్యాన్ని, అందులో గొప్పతనాన్ని వెండితెరపై ఆవిష్కరించాలి అనుకున్న సంధ్యారాజు బృందాన్నిఅభినందించాలి. ఇది ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌క‌న్నా అవార్డులు రావ‌చ్చ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించింది.
రేటింగ్ః 2.5/5