శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (09:40 IST)

సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు (89) తుదిశ్వాస విడిచారు. ఆదివారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజాముణ ఆయన కన్నుమూశారు.
 
వర్తమాన కవిత్వంలో వచ్చిన మార్పులను వివరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన వ్యాసాలు.. వర్తమాన రాజకీయాలకు దర్పణాలు. సుదీర్ఘమైన అనుభవం కలిగిన తుర్లపాటి పద్మశ్రీ బిరుదుతో పాటు అనేక అవార్డులు, రికార్డులు సొంతం చేసుకున్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డు, అష్టాదశ సహస్రసభా కేసరి బిరుదు కూడా పొందారు.

ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలు కొని నారా చంద్రబాబు నాయుడు వరకు 18 మంది ముఖ్యమంత్రులతో తుర్లపాటి పనిచేశారు. ఆయన రాసిన ‘18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు’ అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అనితర సాధ్యుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు తుర్లపాటి.
 
బెజవాడ పాటిబండవారివీధిలో 1931 ఆగస్టు 10న తుర్లపాటి కుటుంబరావు జ‌న్మించారు. నాన్న సుందర రామానుజరావు. వీరి స్వగ్రామం పామర్రు. న్యాయవాద వృత్తిని కూడా కొనసాగించారు. ఇకచ ఆయ‌న అమ్మ శేషమాంబ కవయిత్రి, పాటల రచయిత్రి, భక్తురాలు. తుర్లపాటికి ఇద్దరు సోద‌రులు, ఒక అక్క, ఒక చెల్లెలు ఉన్నారు.

‘మాతృభూమి’ పత్రికలో ‘స్వరాజ్యంలో స్వాతంత్య్రం’ అనే ఆయ‌న‌ తొలివ్యాసం 1947 మార్చి 22న ప్రచురితమైంది. ఆయ‌న జీవిత భాగ‌స్వామి అయిన కృష్ణకుమారి కూచిపూడి నాట్యకళాకారిణి. అత‌నిది ప్రేమ వివాహం కాగా, కోల్‌కతాలో సన్మానం పొందటానికి రైల్లో వెళుతున్న స‌మ‌యంలో ఆమెతో ప‌రిచయం ప్రేమ‌గా మారింది.

1959 జూన్‌ 12న ఆయ‌న‌ వివాహం జరిగింది. 1979లో కేన్సర్‌ మహమ్మారి బారినపడి కృష్ణ కుమార్ కన్నుమూశారు. ఆయ‌న భార్యపేరిట కృష్ణకళాభారతి సంస్థ స్థాపించి ఏటా కళా ప్రముఖులను సత్కరిస్తూ వ‌స్తున్నారు.
 
తుర్లపాటి మృతి పాత్రికేయ లోకానికి తీరని లోటు: దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు
 
ప్రముఖ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు మృతిపట్ల దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు సంతాపం వ్యక్తం చేశారు. తుర్లపాటి కుటుంబరావుతో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.
ఆయ‌న‌ జర్నలిజంలోకి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందడం గర్వించదగ్గ పరిణామన్నారు.

కుటుంబరావు రాసిన పుస్తకాలు అందరికీ ఆదర్శం అన్నారు. సుధీర్ఘకాలం జర్నలిజం వృత్తిలో మకుఠం లేని వ్యక్తిగా కుటుంబరావు నిలిచారన్నారు. తుర్లపాటి కుటుంబరావు మృతికి సంతాపం, వారి  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి  తెలిపారు... ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

తుర్లపాటి కుటుంబరావు మృతిపట్ల చంద్రబాబు సంతాపం
ప్రముఖ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 
 
‘‘సీనియర్ పాత్రికేయునిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి సేవలు శ్లాఘనీయం. పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు. ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది. 
తుర్లపాటి కుటుంబరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

తుర్లపాటి కుటుంబరావు మరణం బాధాకరం: అచ్చెన్నాయుడు
తుర్లపాటి కుటుంబరావు మరణం బాధాకరం. కుటుంబరావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది. ఆయన ఆత్మకు చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఆధునిక రాజకీయ జర్నలిస్టులలో కుటుంబరావుది అందె వేసిన చెయ్యి, యువతరానికి మార్గదర్శకుడిగా నిలిచారు. 

చిన్న వయస్సులో జర్నలిజంలోకి అడుగు పెట్టి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందడం గర్వించదగ్గ పరిణామం. కుటుంబరావు రాసిన పుస్తకాలు అందరికీ ఆదర్శంగా ఉంటాయి. సుధీర్ఘ జర్నలిజం వృత్తిలో మకుఠం లేని వ్యక్తిగా కుటుంబరావు నిలిచారు. 
 
'తుర్లపాటి' మృతి దిగ్భ్రాంతికరం: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
సీనియర్ జర్నలిస్టు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ పత్రిక రచయిత, పద్మశ్రీ డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు (89) ఆదివారం అర్థరాత్రి మృతి చెందారు. ఆయన  మరణం ఎంతో దిగ్భ్రాంతికరం. ఆయన మృతి పట్ల తెదేపా రాష్ట్ర ప్రధాకార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సానుభూతిని వ్యక్తం చేశారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి  ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. యువతరానికి మార్గదర్శకుడిగా నిలిచారని, చిన్న వయస్సులో జర్నలిజంలోకి అడుగు పెట్టి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందడం గర్వించదగ్గ పరిణామన్నారు.  కుటుంబరావు రాసిన పుస్తకాలు అందరికీ ఆదర్శంగా ఉంటాయని, సుధీర్ఘ జర్నలిజం వృత్తిలో మకుఠం లేని వ్యక్తిగా కుటుంబరావు నిలిచారని అభిప్రాయపడ్డారు.