శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (21:05 IST)

సిస్టర్ స్టెల్లా డిసౌజా కన్నుమూత

ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతి గాంచిన విజయవాడ అట్కిన్సన్ స్కూల్ మాజీ ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ స్టెల్లా డిసౌజా (82) సోమవారం కన్నుమూశారు.

విజయవాడ పాతబస్తీలోని అట్కిన్సన్ సీనియర్ సెకండరీ పాఠశాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో సిస్టర్ స్టెల్లా ఎనలేని కృషి చేశారన్నారు.అట్కిన్సన్ సీనియర్ సెకండరీ పాఠశాలలో ముప్పై రెండు సంవత్సరములు ప్రధానోపాధ్యాయురాలుగా సేవలందించిన సిస్టర్ స్టెల్లా వేల మంది బాలికలకు ఆంగ్లమాధ్యమంలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించారు.

బాలికలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది,పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి అనేక రాష్ట్ర,జాతీయ అవార్డులు పొందిన విశ్రాంత సిస్టర్స్ స్టెల్లా డిసౌజా సోమవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కన్నుమూశారు.

23-07-1937న మంగళూరులో జన్మించిన సిస్టర్ స్టెల్లా యుక్తవయసులో దైవ పిలుపుమేరకు సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్ ఆఫ్ ప్రావిడెన్స్ మఠంలో కన్యత్వాన్ని స్వీకరించి, శిక్షణ అనంతరం అనేక సేవలందిస్తూ 1982వ సంవత్సరం జూన్ 1వ తేదీన అట్కిన్సన్ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా బాధ్యతలను స్వీకరించారు.

నాటి నుండి పాఠశాల మరియు విద్యార్థుల అభివృద్ధి కోసం,సామాజిక మార్పుకోసం, విలువలతో కూడిన విద్యతో పాటు సౌకర్యవంతమైన భవనాలు,అధునాతన మౌలిక సదుపాయాలు కల్పించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యుత్తమ పాఠశాలగా తీర్చిదిద్దారు.

నూట ఇరవై ఒక్క ఏళ్ల ఘనచరిత్ర కలిగిన అట్కిన్సన్ పాఠశాల కీర్తిప్రతిష్టలు ఇనుమడింప చేయడంలో సిస్టర్ స్టెల్లా పాత్ర మరువలేనిదనీ సిస్టర్ స్టెల్లా లేని లోటు తీర్చలేనిదని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.

విద్యార్థినులు, అభిమానులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం సిస్టర్ స్టెల్లా భౌతికకాయం పాఠశాల ప్రాంగణంలో ఉంచి, మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అట్కిన్సన్ పాఠశాలలో ప్రార్థనల అనంతరం గొల్లపూడి ఆషా ఆసుపత్రి ప్రాంగణంలో భూస్థాపన కార్యక్రమం జరుగుతుందని స్కూలు నిర్వాహకులు తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యంగా బాలికలకు ఆంగ్లమాధ్యమంలో 32 సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందించి, రాష్ట్ర,దేశ, విదేశాలలో ఉన్నత స్థానాల్లో అనేకమందికి మార్గదర్శిగా నిలిచిన సిస్టర్ స్టెల్లా ఆకస్మిక మరణం పట్ల నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు కొలకలూరు శ్యాంఫాల్, రాష్ట్ర అధ్యక్షులు జార్జి ముల్లర్, ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులు గంటా విజయ్ కుమార్,

రాష్ట్ర మీడియా అధ్యక్షులు గుత్తుల సాల్మన్ దొర,సుభాషిని చౌదరి, విజయవాడ క్రైస్తవ పెద్దలు, పాస్టర్ ల నాయకులు, యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.