ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (21:28 IST)

విశిష్ట ప్రతిభావంతులు కోసం ప్రత్యేక నియామక ప్రక్రియ: మంత్రి వనిత

ప్రపంచంలోని అందరి అంధుల మనసుల్లోనూ “సర్ లూయీ బ్రెయిలీ' అక్షర ప్రదాతగా నిలిచిపోతారని, అంధులు తమలో ఉన్న నిగూఢ శక్తితో ప్రపంచం గుర్తించేలాగా ఎదగాలని రాష్ట్ర స్త్రీ శిశు, విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఎమ్మెల్యే మల్లాది విషుణవర్ధనరావు అధ్యక్షతన జరిగిన సర్ లూయీ బ్రెయిలీ 211వ జన్మదిన వేడుకల్లో మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్ లూయీ పుట్టిన్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతంగా పుట్టారన్నారు.

ఆయన తన తండ్రి ఒక చర్మకార వృత్తి చేసేవారని, తన తండ్రి చేసే పనులను అనుసరించి పొరపాటున కంటిలో పదునైన వస్తువు గుచ్చుకోవడంతో ఒక కన్ను పోయిందని, తర్వాత కొన్ని సంవత్సరాలకు రెండవ కన్నుకు కూడా అంధత్వం వచ్చిందన్నారు. చూపుపోయినా అధైర్య పడకుండా తన అసాధారణ ప్రతిభాపాటవాలతో వ్యక్తిగా రాణించి అప్పటికే అమల్లో ఉన్న “లైన్ టైప్” పద్ధతిలో చదువుకుని అతిచిన్నవయస్సులోనే ప్రొఫెసర్ గా అయ్యారన్నారు.

అంధులు చూసే అవకాశం లేనందున స్పర్శ ద్వారా చదువుకోగలుగుతారని, అందుకోసం అప్పటివరకూ అందుబాటులో ఉన్న లిపిని ఆరు చుక్కలకు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రపంచంలోని అంధులకు అక్షర ప్రదాతగా సర్ లూయీ బ్రెయిలీ నిలిచిపోయారని, మనందరం ఆయనను గౌరవించాలన్నారు.

మనోధైర్యం, మేథస్సుతో ప్రత్యేక గుర్తింపును సర్ లూయీ బ్రెయిలీ తెచ్చుకోగలిగారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశిష్ట ప్రతిభావంతులు కోసం ప్రత్యేక నియామక ప్రక్రియను చేపట్టిందని మంత్రి తానేటి వనిత తెలిపారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి విశిష్ట ప్రతిభావంతులకోసం ఎన్నో పధకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

విశిష్ట ప్రతిభావంతులకోసం కేటాయించబడిన బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను 2020 మార్చి నాటికి ప్రత్యేక డ్రైవ్ ద్వారా పూర్తి చేయాలని ఉత్తరువులు ఇవ్వడం జరిగిందన్నారు. విశిష్ట ప్రతిభావంతులకు అందించే మూడు వేల రూపాయల ఫింఛను పథకాన్ని అంధులకు గతంలో 40 నుండి 19 శాతం, 80 శాతం పైబడిన వారికి శ్లాబ్ పద్దతి ఆధారంగా ఇచ్చేవారని, కానీ తమ ప్రభుత్వం ఆవిధానాన్ని తొలగించి అర్హులైన విశిష్ట ప్రతిభావంతులు అందరికీ శాతంతో సంబంధం లేకుండా ఫింఛను పథకాన్ని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

వీరికోసం ప్రత్యేక వసతిగృహాలతో పాటు ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్, జగనన్న విద్యాదీ వెన, జగనన్న వసతి దీవెన, ఆర్ధిక చేకూర్పు, వైయస్ఆర్ పెండ్లి కానుక వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. 2019-20 సంవత్సరంలో ఆర్ధి కపునరావాసంలో భాగంగా 10 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసామన్నారు.

వినికిడి లోపంగల వారికోసం గతంలో ఒక చెవికి మాత్రమే శస్త్రచికిత్సకు వీలు ఉండేదని వైయస్. జగన్మోహన రెడ్డి అపారమైన ప్రేమానురాగాలతో అధిక భారమైనా రెండు చెవులకు ఆపరేషన్ చేయించేందుకు నిధులు ఇవ్వాలని ఆదేశించారన్నారు.

తల్లిదండ్రులు కంటే మిన్నగా స్వచ్చంధ సంస్థలు, ఉద్యోగులు సేవాభావంతో ఎ ంతో కృషి చేయడం జరుగుతోందన్నారు. గురుకుల పాఠశాలలు, వసతిగృహాలు, హోమ్‌ల ద్వారా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడం జరుగుతోందన్నారు. అంధత్వంతో బాధపడేవారికోసం విజయనగరం, విశాఖపట్నం, హిందుపురంలలో ప్రత్యేక విద్యను అందించడం జరుగుతోందని మంత్రి తెలిపారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధనరావు మాట్లాడుతూ ఎంతో ప్రతిభావంతుడైన లూయీ బ్రెయిలీ అంధుల అందరి హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని అన్నారు. ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణకు, వారు హుందాగా జీవించేలా ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట ప్రతిభావంతులకు అన్నివిధాల సహాయసహకారాలు అందించడంతో పాటు ప్రభుత్వపరంగా అండదండలు అందిస్తోందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2 లక్షల 3 వేల 167 మంది విశిష్ట ప్రతిభావంతులు రాష్ట్రంలో ఉన్నారన్నారు. కంటిపరీక్షలను నిర్వహించడం ద్వారా అంధత్వం బారినపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.

ఏడాదికి రెండు లక్షల లోపు ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విశిష్ట ప్రతిభావంతుల పిల్లలకు జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నామన్నారు. ఐటిఐ చదివే విద్యార్ధులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై చదివే విద్యార్ధులకు రూ.20 వేలు చొప్పున ఆర్థిక చేయూతను అందిస్తున్న‌ట్లు తెలిపారు.

ఆర్ధిక చేకూర్పు క్రింద లక్ష రూపాయల యూనిట్ కు 50 శాతం సబ్సిడీతో బ్యాంకు లింకేజ్‌తో ఋణాలను అందిస్తున్నామన్నారు. వైయస్ఆర్ పెండ్లికానుక క్రింద ఇప్పటివరకు ఇచ్చే రూ. లక్ష రూపాయల ప్రోత్సాహాకాన్ని ఏప్రిల్ 2వ తేదీ నుండి రూ.1.50ల‌క్ష‌ల‌కు పెంచుతూ ఉత్తరువులు జారీ చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.35.26 కోట్లను కేటాయించామన్నారు.

ఈ ఏడాది 190 మందికి 60 లక్షల వ్యయంతో ల్యాప్టాన్లు అందిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత బ్రెయిలీ ప్రెస్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019-20లో ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను మానసిక పరిపక్వత లేని విశిష్ట ప్రతిభావంతులకోసం బడ్జెట్లో రూ.36.18 లక్షలు విడుదల చేయడం జరిగిందన్నారు. అంధ ఉద్యోగుల సమస్యల పట్ల ఉన్నతాధికారులు స్పందించి వారికి సరైన న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని కోరారు.  

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కె.దమయంతి మాట్లాడుతూ సర్ లూయీ బ్రెయిలీ జీవితం అంధులకి ఆదర్శం అన్నారు. తన మూడవ ఏటయే చూపు కోల్పోయినా నిరుత్సాహపడకుండా బ్రెయిలీ లిపిని రూపుదిద్ది ఉన్నతస్థాయికి చేరుకున్న వ్యక్తి అన్నారు. శాస్త్రీయంగా, మానసికంగా పట్టుసాధించాల్సి ఉంటుందని ఆదిశలో విశిష్ట ప్రతిభావంతులు తమ ప్రతిభ పైనే ఆధారపడి ఉండాలన్నారు.

కొద్ది పాటి చేయూతను ఇచ్చినా దానికి రెట్టింపు పనితనాన్ని, ప్రతిభను చూపే వారిగా విశిష్ట ప్రతిభావంతులకు తమదైన గుర్తింపు ఉందన్నారు. బ్రెయిలీ లిపిలో పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, ఉద్యోగ నియామకాల్లో రోస్టరు పాయింట్ పైనా విజ్ఞప్తి చేసారని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. విశిష్ట ప్రతిభావంతులకోసం ఉపాధ్యాయులు, స్వచ్చంధ సంస్థలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.

శాఖతరపున ఆశావహ ధృక్పధంతో పనిచేస్తామని, వారికి అన్ని విధాల అండగా ఉండి మరింత కృషి చేస్తామని దమయంతి తెలిపారు. విశిష్ట ప్రతిభావంతుల శాఖ సంచాలకులు కిషోర్ కుమార్ మాట్లాడుతూ మానవతావాదిగా ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి విశిష్ట ప్రతిభావంతుల కోసం కృషి చేస్తున్నారన్నారు.

అంధులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న పధకాల అమల్లోని శాతం విధానాన్ని రద్దుచేసి అర్హులైన వారందరికీ ఒకేరకంగా పధకాల లబ్దిని అందించడం శుభపరిణామం అన్నారు. సర్వేద్రియానాం నయనం ప్రదానం అనే నానుడిని అనుసరించి కంటి పరీక్షలు చేయడం ద్వారా అంధత్వం రాకుండా ప్రభుత్వం అడుగులు వేయడం మంచి విషయమన్నారు.

గ్రామ, వార్డు వాలంటీర్లు విశిష్టప్రతిభావంతులను గుర్తించి ప్రభుత్వపరంగా అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారిదరి చేర్చాలని కోరారు. ప్రభుత్వంలో వివిధ శాఖలు ఉన్నా విభిన్న ప్రతిభావంతుల శాఖలో సేవాభావంతో పనిచేయడం గొప్ప విషయంగా ఆయన పేర్కొన్నారు. భగవంతుడు వెలుగై ఉంటాడు అన్న పదాన్ని వాస్తవం చేస్తూ సేవాభావంతో ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

అంధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రవీంద్రబాబు మాట్లాడుతూ తాము జీవితాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని నేడు ఈ స్థితికి రాగలిగామన్నారు. సర్ లూయీ బ్రెయిలీ వల్లనే తాము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని, సమాజంలో ఉన్నతస్థానంలో ఉండగలుగుతున్నామన్నారు. విశిష్ట ప్రతిభావంతులను వారికి ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ పిలిస్తే అటువంటివారిపై కఠినమైన చర్యలను తీసుకోవడం పై ప్రభుత్వం ఉత్తరువులు ఇవ్వడంపట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

ఉద్యోగ నియామకాల్లో రోస్టరుపాయింట్ ఆరులో విశిష్ట దివ్యాంగులకో టాలో కేవలం మహిళలకు కేటాయించడం జరిగిందని, వీటి ని విశిష్ట దివ్యాంగుల కోటాగా మార్పు చేయాలని కోరుతున్నామన్నారు. విశిష్ట ప్రతిభావంతుల ప్రతినిధి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ విశిష్ట ప్రతిభావంతులకు, అంధులకు నిజమైన నూతన సంవత్సర దినోత్సవం సర్ లూయీ బ్రెయిలీ జన్మదినమైన జనవరి 4వ తేదీ అని అన్నారు.

యస్సీ రుణాలకు బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో 2004 నుండి పరిగణంలోకి తీసుకున్న విధంగానే తమకు కూడా వర్తింప చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా విశిష్ట ప్రతిభావంతుల కోసం సేవలను అందిస్తున్న డాక్టర్ వి. విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ డా. టికెవి. శ్రీనివాసరావు, విజయమేరి ఇంటిగ్రేటెడ్ స్కూలు ఫర్ బ్లెండ్ ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ గంటా జనార్ధన్ నాయుడు, ఇంగ్లీష్ లెక్చరర్ గురుప్రతాప్ రెడ్డిలను దుశ్శాలువా క‌ప్పి మెమెంటో అందించి సత్కరించారు.

చదువులలో విశిష్ట ప్రతిభ చూపుతున్న 13 మంది విద్యార్థినీ విద్యార్ధులకు ల్యాప్టాప్లను బహుకరించారు. ఇందులో భాగంగా బెలగం మీనాజగదీశ్వరి, పి.విజయ్ కుమార్, తోటా అనూష, తదితరులకు మంత్రి చేతులుమీదుగా ల్యాప్టాప్లు అందజేసారు. అనంతరం విశిష్ట ప్రతిభావంతుల శాఖ రూపొందించిన బ్రెయిలీ కేలండరును, బ్రెయిలీ లిపిలో రూపొందించిన శాఖనిర్వాహణా పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కార్యక్రమంలో కృష్ణాజిల్లా విశిష్ట ప్రతిభావంతుల అసిస్టెంట్ డైరెక్టరు ఏవిడి నారాయణరావు, పలు పాఠశాలల విద్యార్దినీ, విద్యార్ధులు, విశిష్ట ప్రతిభావంతులు, తదితరులు పాల్గొన్నారు.  కార్య‌క్ర‌మంలో ప‌లువురు విశిష్టప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్ధులు ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.