శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (21:15 IST)

ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏమిటి...?

ప్రభుత్వాలు తీసుకునే కొన్ని చర్యలు ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే అవి అరుదైన సందర్భాలే. తాజాగా డీజీపీ సవాంగ్ ఆధ్వర్యంలో ఏపీ నలుమూలల్లో ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దానిపేరు ఆపరేషన్ ముస్కాన్. ఎందుకీ ఆపరేషన్ చేస్తారో తెలుసా...

అనాథ బాలబాలికల కోసం. తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చి కొందరు గమ్యం తెలియని అనాథ జీవితం గడుపుతుంటారు. ఇలాంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పబ్లిక్ ప్లేసుల్లో గుర్తించడానికి పోలీసు బృందాలు, బాలల బాధ్యతా సంస్థలు చేసే ఆపరేషన్ ఇది. 

ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు దామోధర్ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో రెండు  రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ ..
 
రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లితండ్రుల వద్దకు చేర్పించడం, అనాధలకు పునరావాసం కల్పించేందుకై పోలీస్ శాఖ రెండు రోజులపాటు ఆపరేషన్ ముస్కాన్  ను రాష్ట్రవ్యాప్తం గా నిర్వహిస్తోంది. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో  ఈ ఆప‌రేష‌న్‌లో పోలీస్ శాఖతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యా, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, క్రీడా శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు కూడా భాగస్వామ్యమవుతున్నాయి .

రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులు,రాష్టం లో ఉన్న బాలబాలికల  వివరాలను సేకరించి వారి ఫోటోలు కలిగిన ఆల్బమ్ ను రూపొందిస్తారు. ఈ వివరాలతో ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లను, జ‌న‌సామ‌ర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, నిర్మాణ స్థలాలు, హోటళ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను తనికీ చేస్తారు.

ఇందుకుగాను ప్రతీ సబ్ డివిజన్ లో ఒక ఎస్.ఐ, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు కలిగిన ప్రత్యేక టీమ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ టీమ్‌లో ఒక మహిళా సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ టీమ్ సభ్యులు పోలీస్ డ్రెస్‌ను ధరించరు.  ఈ త‌నికీల సందర్బంగా గుర్తించిన పిల్లల ఫొటోలతో కూడిన సమాచారాన్ని చైల్డ్ ట్రాక్ పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు.

ఆపరేషన్ ముస్కాన్ లో గుర్తించి స్వాదీనం చేసుకున్న పిల్లను 24 గంటలలోపు ఆయా జిల్లాల్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు అప్పగిస్తారు.  చైల్డ్ వెల్ఫర్ కమిటీల ద్వారా దొరికిన   పిల్లలను  వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. సరైన చిరునామా దొరకని పిల్లలను షెల్టర్ హోంలలో ఉంచుతారు.

రెండు  రోజుల పాటు నిర్వహించే ఈ ఆపరేషన్ ముస్కాన్   కార్యక్రమంలో సంబంధిత‌ విభాగాలైన షెల్టర్ హొంలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, డి.సి.ఆర్.బి, చైల్డ్ హెల్ప్ లైన్, చైల్డ్ వెల్ఫేర్‌ ఆఫీసర్, జూవెనైల్ జస్టిస్ బోర్డ్, ఐ.సి.డి.ఎస్, చైల్డ్ వెల్ఫేర్‌ కమిటీలు పూర్తిగా పాల్గొనడంతో పాటు తమ దగ్గర ఉన్న‌ సమాచారాన్ని అందరికీ అందించి పిల్లలను గుర్తించేదుకు కృషిచేస్తారు.

ఈ రెండు  రోజులు ఆపరేషన్ ముస్కాన్ ద్వారా  గుర్తించిన వారి వివరాలను ట్రాక్ చైల్డ్ పోర్ట‌ల్‌లో పొదుప‌రుస్తారు. దొరికిన  పిల్లల్లో ఎవరైనా వ్యసనాలకు గురైతే వారిని డి అడిక్షన్ కేంద్రాలకు పంపిస్తారు. ఈ ఆపరేషన్ ముస్కాన్  కార్యక్రమం సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలలో బాల కార్మికులు  దొరికినట్లైతే  ఆయా యజమానులపై  బాల కార్మిక నిషేధ చట్టం, వెట్టిచాకిరి నిరోధక చట్టం తదితర చట్టాలను  అనుసరించి కేసులు నమోదు చేస్తారు.

ఈ పిల్లల్లో ఎవరైనా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వారు ఉంటే యజమానులపై ఎస్సీ, ఎస్టి అత్యాచార నిరోధక చట్టం కేసులు కూడా నమోదు చేస్తారు. ఈ కార్యక్రమం మొత్తం డి‌జి‌పి నేతృత్వంలో ఉండే స్పెషల్ జువనైల్  పోలీస్ యూనిట్ల  పర్యవేక్షణలో ఉంటుంది.

కాగా,  కేవలం 2019లో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 5739 మంది చిన్నారులను  ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు  రక్షించారు. ఈ రోజు జరిపిన స్పెషల్ డ్రైవ్ లో 3636 మంది బాలబాలికలు రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసిన బాలురు 3039 మంది కాగా , 597 బాలికలను  రక్షించారు.